నిధుల్లేక.. పనులు సాగక
ABN , Publish Date - Jan 01 , 2026 | 10:59 PM
నిధుల కొరత కారణంగా అడారిగెడ్డ డైవర్షన్ చానల్ పనులు నిలిచిపోయాయి.
- పన్నెండేళ్లుగా నిలిచిన అడారిగెడ్డ డైవర్షన్ చానల్ నిర్మాణం
- 575 ఎకరాలకు అందని సాగునీరు
- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
మక్కువ రూరల్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): నిధుల కొరత కారణంగా అడారిగెడ్డ డైవర్షన్ చానల్ పనులు నిలిచిపోయాయి. పన్నెండేళ్లు అవుతున్నా ఈ పనులకు అతీగతి లేకపోవడంతో వందల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. పనసభద్ర పంచాయతీ ఆలగురువు, గుంటభద్ర గ్రామాలతో పాటు మార్కొండపుట్టి పంచాయతీలోని బొడ్డుసామంతవలస, కోదుపెద్దవలస గ్రామాల్లోని 575ఎకరాల భూములకు సాగునీరందించేందుకు 2008-2009లో ఆలగురువు సమీపంలో అడారు గెడ్డపై డైవర్షన్ చానల్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు రూ.2.10కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.1.86కోట్లతో పరిపాలనా అనుమతులిచ్చి అధికారులు టెండర్‌ను ఖరారు చేశారు. అనంతరం 2010లో 12నెలల కాలపరిమితితో అడారిగెడ్డపై అడ్డుగా గోడను నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. 85మీటర్ల పొడవున అడ్డంగా గోడను నిర్మించి, తద్వారా నీటిని డైవర్షన్ చానల్ ద్వారా 575ఎకరాలకు సాగునీటిని అందించేందుకు, అలాగే సురాపాడు కాలువకు అనుసంధానం చేసేందుకు మూలవలస వరకు మూడు కిలోమీటర్ల పొడవున కాలువను నిర్మించేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు 80 మీటర్ల వరకు అడ్డుగోడను పూర్తి చేశారు. మిగతా పనులు చకచకా జరుగుతున్న సమయంలో ఫారెస్టు డిపార్టుమెంట్ అధికారులు అడ్డుపడ్డారు. ఆ ప్రాంతం అటవీ శాఖకు చెందినదని, పనులు నిలిపివేయాలని నీటిపారుదలశాఖకు ఆదేశాలు జారీచేశారు. దీంతో 2013 నుంచి పనులు నిలిచి పోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఫారెస్టు డిపార్టుమెంట్ అడ్డంకులను తొలగించి, తిరిగి డైవర్షన్ చానల్ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకుంది. అయితే నిధుల కొరత కారణంగా పనులు ముందుకు కదల్లేదు. కూటమి ప్రభుత్వమైనా నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. దీనిపై నీటిపారుదల శాఖ ఏఈ అన్స్‌ర్వెల్లిను వివరణ కోరగా.. ‘ఆగిపోయిన పనులను ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్వోదయ పథకం ద్వారా రూ.6.5కోట్ల నిఽధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే అడారుగెడ్డ డైవర్షన్ చానల్ నిర్మాణం పూర్తిచేస్తాం’ అని తెలిపారు.