Dry Day ఇకపై వారానికి రెండుసార్లు డ్రైడే
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:36 PM
Dry Day to Be Observed Twice a Week సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఇకపై వారంలో రెండుసార్లు డ్రైడే పాటించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. శుక్రవారం డోకిశీల పీహెచ్‌సీ పరిధిలోని మారుమూల గ్రామం డెప్పివలసను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని , డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
పార్వతీపురం రూరల్, జూలై 3(ఆంధ్రజ్యోతి): సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఇకపై వారంలో రెండుసార్లు డ్రైడే పాటించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. శుక్రవారం డోకిశీల పీహెచ్‌సీ పరిధిలోని మారుమూల గ్రామం డెప్పివలసను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని , డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. తొలుత శిబిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, పరీక్ష వివరాలను పరిశీలించారు. అనంతరం గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసు కున్నారు. గ్రామంలోని నీటి నిల్వలు, ఇళ్ల పరిసరాలను పరిశీలించిన అనంతరం దోమల నివార ణకు ప్రతి ఒక్కరూ వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలని సూచించారు. ప్రస్తుత సీజన్ దృష్ట్యా ప్రజలందరూ కాచిచల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఆహార పదార్థాలపై మూతలు ఉంచుకోవడంతో పాటు తప్పనిసరిగా దోమతెరలు వినియోగించాలని తెలిపారు. కాగా జిల్లాలోని 217 మలేరియా హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి.. 7,276 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిశీలనలో వైద్యాధికారి బి.ఫణీంద్ర, డెమో ప్రసాద్, ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
అందుబాటులో అత్యవసర మందులు
గరుగుబిల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అత్యవసర మందులు, పాము, కుక్కకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు సూచించారు. శుక్రవారం గురుగుబిల్లి పీహెచ్‌సీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల పరిధిలో సబ్ సెంటర్లకు అవసరమైన మందులను సరఫరా చేయాలని సూచించారు. తనిఖీలకై వచ్చిన వారి వివరాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. ఈ-ఔషధికి సంబంధించి సమాచార సేకరణలో నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈహెచ్‌ఆర్ విధిగా అమలుపర్చాలన్నారు. మొత్తంగా ల్యాబ్‌లో 63 పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రజలను నాటు వైద్యానికి దూరం చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి టి.జగన్మోహనరావు తదితరులు ఉన్నారు.