Drought in ten mandalsపది మండలాల్లో కరువు
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:52 PM
Drought in ten mandals ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, పంటల స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. జిల్లాలో పది మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. మరో 12 మండలా లను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించింది.
పది మండలాల్లో కరువు
మరో 12 మధ్యస్థ కరువు మండలాలు
ప్రకటించిన ప్రభుత్వం
ఖరీఫ్ తొలి నుంచి అన్నదాతలకు కష్టాలే
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి):
ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, పంటల స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. జిల్లాలో పది మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. మరో 12 మండలా లను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించింది. తీవ్రలోటు వర్షపాతం, సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ 22 మండలాలను కరువు మండలాలుగా గుర్తించింది. ఆ వివరాలతో గురువారం జీవో విడుదల చేసింది.
ఈ ఏడాది ఎల్‌నినో వల్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి వర్షాలు పెద్దగా లేవు. రైతులు నిత్యం ఆకాశం వైపు చూస్తూ గడిపారు. జూన్ నుంచి సెప్టెంబరు7 వరకు 52.1 సెంటీమీటర్ల వర్షం కురవాలి. కానీ 29.4 సెంటీమీటర్ల వర్షపాతమే నమో దైంది. ఈ పరిస్థితిలో వరి నారు వేసుకున్నప్పటికీ అందరూ ఉబాలు పనులు చేపట్టలేదు. దీంతో సాగువిస్తీర్ణం తగ్గింది. అలాగే డ్రైస్పెల్స్, చెరువులు, నదులు, రిజర్వాయర్లలోనూ నీటి నిల్వలు అంతంతమాత్రమే. గత వారం కురిసిన వర్షాలకు కొద్దిమోతాదులోనే నీళ్లు చేరాయి. మొత్తంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వ్యవసాయ అధికారులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. 23 మండలాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా నివేదికలు పంపించారు. వాటి ఆధారంగా గురువారం జిల్లాలో 22 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రమైన కరువు మండలాలుగా ఎస్.కోట, వేపాడ, కొత్తవలస, జామి, పూసపాటిరేగ, దత్తిరాజేరు, చీపురుపల్లి, బొండపల్లి, వంగర, రాజాం పేర్లను పేర్కొనగా.. సాధారణ (మధ్యస్థ) మండలాలుగా మెరకముడిదాం, గరివిడి, గుర్ల, సంతకవిటి, గజపతినగరం, ఎల్.కోట, మెంటాడ, నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, విజయనగరం మండలాలను ప్రకటించింది. కాగా ప్రకటించిన కరువు మండలాల్లో రైతులకు రుణసదుపాయాలు, కరువు సహాయక చర్యలు చేపట్టేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం జీవోలో పొందుపరించింది.