Share News

చినుకు...వణుకు

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:09 PM

జిల్లాలో సోమవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆకాశమంతా మేఘావృతమై కొన్ని చోట్ల చిరు జల్లులు పడ్డాయి.

 చినుకు...వణుకు
ఓని గ్రామంలో పొలంలోనే కుప్పలుగా ఉన్న మినుము

- జిల్లాలో చిరు జల్లులు

- పొలాల్లోనే అపరాల పంట

- రబీ రైతుల్లో ఆందోళన

పాలకొండ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆకాశమంతా మేఘావృతమై కొన్ని చోట్ల చిరు జల్లులు పడ్డాయి. మంగళవారం కూడా జిల్లా అంతా మేఘావృతమై ఉంది. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో మినుము, పెసర పంట కోతకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని చోట్ల కుప్పల రూపంలో పంట పొలాల్లోనే ఉంది. ఈ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో రబీ రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో జిల్లాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో రైతులు మరింత దిగాలు చెందుతున్నారు. వర్షం కురిస్తే మినుము, పెసర మొక్కలు తడిసిపోతాయని, గింజలకు మొలకలు వచ్చేస్తాయని ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల పత్తి పంట కోతకు వచ్చింది. కూలీల కొరతతో సకాలంలో పత్తిని ఏరలేని పరిస్థితి ఉంది. వర్షం పడితే పత్తి తడిసిపోయి రైతులకు నష్టం వాటిల్లనుంది.

తగ్గిన దిగుబడి...

జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో మినుము, పెసర తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. పొగమంచు కారణంగా పూత మాడిపోవడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. సాధారణంగా పెసర ఎకరాకి 3 నుంచి ఐదు క్వింటాళ్లు, మినుములు మూడు నుంచి ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. కానీ, ఈ ఏడాది ఈ రెండు పంటలూ క్వింటా, రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ధర మాత్రం కొంత ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో మినుము క్వింటా రూ.7 వేలు, పెసర రూ.8 వేలు పలుకుతుంది. ధర బాగున్నప్పటికీ దిగుబడి లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు పరిస్థితి నెలకొంది.

Updated Date - Feb 24 , 2026 | 11:09 PM