పైపులైన్ లీకులతో తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:52 AM
పట్టణ ప్రజలను గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య వేధిస్తోంది.
- ఏడు దశాబ్దాల నాటి పైపులైన్ల ద్వారానే ఇప్పటికీ సరఫరా
- కొత్తవి ఏర్పాటు చేసినా వినియోగంలోకి తీసుకురాని వైనం
- తాగునీటి వృథాపై దృష్టి సారించని అధికారులు
- నూతన పాలకవర్గంపైనే ఆశలు
పార్వతీపురంటౌన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజలను గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. ఇప్పటికే మునిసిపాలిటీలోని 36 వార్డులకు వారం రోజుల నుంచి పది రోజులకొకసారి కుళాయిల నుంచి తాగునీటి సరఫరా అవుతుంది. దీనికితోడు ఇప్పుడు పైపులైన్లకు ఎక్కడపడితే అక్కడ లీకులు ఏర్పడడంతో తాగునీరు వృథాగా పోతుంది. ఫలితంగా పట్టణ ప్రజలు మరిన్ని కష్టాలు పడుతున్నారు. ఒకపక్క తాగునీటి సరఫరా సక్రమంగా జరగక.. మరోపక్క ప్రధాన, లింకు పైపులైన్ల లీకులతో రోజురోజుకూ సమస్య తీవ్రమవుతుంది. అయినా మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికీ పాత పైపులైనే..
ఎప్పుడో 1959లో మునిసిపాలిటీ ఏర్పడినప్పుడు నిర్మించిన పైపులైన్ల ద్వారానే ఇప్పటికీ నీటిని సరఫరా చేస్తున్నారు. అప్పట్లో గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ సమీపంలో ఉన్న నాగావళి నది వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన పంప్ హౌస్ నుంచి పట్టణానికి పైపులైన్‌ను నిర్మించారు. ప్రస్తుతం ప్రధాన పైపులైన్‌తో పాటు లింకు పైపులైన్లకు ఎక్కడపడితే అక్కడే లీకులు ఏర్పడుతుం డడంతో తాగునీరు వృథాగా పోతుంది. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.8 కోట్లతో నూతన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. 18 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు ప్రారంభించకపోవడంతో నిరుపయోగంగా మారింది. ప్రభుత్వాలు మారిన ఆ పైప్‌లైన్‌ను వినియోగంలోకి తేవకపోవడంతో పాటు నూతన పైప్‌లైన్‌ల నిర్మాణానికి గత, ప్రస్తుత ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేదు. దీంతో 36 వార్డుల ప్రజలు బిందెడు నీటి కోసం నానాయాతన పడుతున్నారు. పట్టణ శివారు కాలనీలకు తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయకపోవడంతో నివాసితులు పడుతున్న కష్టాలు ప్రజాప్రతినిధులు, అధికారులకే ఎరుకా. నూతన పాలకవర్గమైనా తమ తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
లీకులను అరికడతాం
తాగునీటి సమస్యను పరిష్కరించడంతోపాటు ప్రధాన, లింకు పైపులైన్ల లీకులకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. పాత పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయాల్సి ఉంది. నూతన పాలకవర్గం అనుమతితో ఆ సమస్యను అధిగమించేందుకు మా వంతు కృషి చేస్తాం.
కిరణ్‌కుమార్, డీఈ, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం.