Dream Home: How Far Away? గృహయోగం.. ఇంకెంత దూరం?
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:21 PM
Dream Home: How Far Away? టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు మోక్షం లభించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. పనులు పూర్తి కావడం లేదు. ఈ ఏడాది ఉగాది నాటికి ఇళ్లు అప్పగిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అది సాధ్యపడలేదు. నేటికీ మౌలిక వసతుల పనులు పూర్తికాపోగా.. ఇంకా పిచ్చిమొక్కల నడుమ గృహ సముదాయాలు దర్శనమిస్తున్నాయి. దీంతో గృహ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా పూర్తికాని నిర్మాణాలు
కొలిక్కిరాని మౌలిక వసతుల కల్పన పనులు
గృహప్రవేశాల కోసం లబ్ధిదారుల ఎదురుచూపు
పార్వతీపురం టౌన్/సాలూరు, జూలై13(ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు మోక్షం లభించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. పనులు పూర్తి కావడం లేదు. ఈ ఏడాది ఉగాది నాటికి ఇళ్లు అప్పగిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అది సాధ్యపడలేదు. నేటికీ మౌలిక వసతుల పనులు పూర్తికాపోగా.. ఇంకా పిచ్చిమొక్కల నడుమ గృహ సముదాయాలు దర్శనమిస్తున్నాయి. దీంతో గృహ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా టిడ్కో గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లాలో పార్వతీపురం, సాలూరులో ఈ పనులు శరవేగంగా చేపట్టారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. సకాంలో బిల్లులు చెల్లించని కారణంగా ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. లబ్ధిదారుల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించింది. అయితే మౌలిక వసతుల పనులు ఇంకా కొలిక్కి రావడం లేదు. మరోవైపు గృహ ప్రవేశాలపై కూడా స్పష్టత కొరవడింది. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి.. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి గృహ యోగం కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల గ్రామ సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మున్సిపల్, రెవెన్యూ అధికారులు అప్పట్లో 12 ఎకరాల ఎకరాలను సేకరించారు. ఈ ఇళ్ల కోసం పట్టణంలోని 1503 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు గృహ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. రెండేళ్ల పాటు గ్రూప్ హౌస్‌ల నిర్మాణం చకచకా సాగింది. ఆ తర్వాత చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల ఇళ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. 2016లో రూ.500 చెల్లించిన 1503 దరఖాస్తుదారుల్లో 768 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. 2017లో లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేసి గ్రూప్ హౌస్‌లను కేటాయించారు. మిగతా వారి దరఖాస్తులను రద్దు చేశారు. అయితే లాటరీ ద్వారా ఎంపికైన వారికి నేటికీ టిడ్కో ఇళ్లను మంజూరు చేయలేదు. కాగా గృహ నిర్మాణాలు జరిగినా.. ఇప్పటి వరకు రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా సౌకర్యాలు ఇంకా చేపట్టకపోవడం వల్ల లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
రూ.50 వేలు చెల్లించిన వారికి నిరాశే..
మధ్య తరగతి కుటుంబాల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం 500 చదరపు అడుగుల్లో గ్రూప్ హౌస్‌లను నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు అప్పట్లో 676 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారంతా రూ.50 వేలు చొప్పున ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వారికి షాక్ ఇచ్చింది. లబ్ధిదారుల జాబితాలో కోత విధించింది. మరోవైపు సాంకేతిక కారణాలు చూపుతూ గ్రూప్ హౌస్‌ల నిర్మాణం చేపట్టలేమని తేల్చేసింది. దీంతో తాము చెల్లించిన డబ్బులు తిరిగివ్వాలని లబ్ధిదారులు అప్పట్లో మున్సిపల్, కలెక్టర్ కార్యాలయాల చుట్టు తిరిగినా ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత శుభవార్త అందించింది. రూ.50 వేలు చెల్లించిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై టిడ్కో కో ఆర్డినేటర్ కాంతారావును వివరణ కోరగా.. ‘ రూ.50 వేలు చెల్లించిన 676 మంది లబ్ధిదారులకు రూ.2.25 కోట్లను త్వరలో చెక్కుల రూపంలో అందిస్తాం. ఇప్పటికే పట్టణంలో 15 సచివాలయాలకు వారి వివరాలను అందజేశాం. టిడ్కో గృహాల సముదాయంలో వసతి కల్పన, ప్రారంభోత్సవాల విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. ’ అని తెలిపారు.
సాలూరులో ఇలా..
సాలూరు పట్టణానికి కూతవేటు దూరంలోని చంద్రంపేట సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో 1444 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. చదరపు అడుగుల విస్తీర్ణం బట్టీ లబ్ధిదారులు రూ.500, రూ.12,500, రూ,37,500 చొప్పున డీడీల రూపంలో మున్సిపల్ కార్యాలయానికి చెల్లించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోలేదు. లబ్ధిదారుల సంఖ్యను కుదించింది. 1248 మందిని అర్హులుగా గుర్తించినా.. ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పనులేవీ పూర్తికాకపోయినా.. ఎన్నికలకు ముందు 2024, ఫిబ్రవరి 20న వైసీపీ సర్కారు హడావుడిగా టిడ్కో గృహ ప్రవేశాలు చేపట్టింది. 22 బ్లాకులకు గాను కేవలం 18 బ్లాకుల్లో 1056 ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో గృహ ప్రవేశాలను ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. అయితే మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఏ ఒక్క లబ్ధిదారు ఆ ఇళ్లలో దిగలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల సముదాయంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను పనులు శరవేగంగా పూర్తి చేసింది. విద్యుత్ సమస్యలను పరిష్క రించింది. దీంతో 900 మంది తమ ఇళ్లకు విద్యుత్ మీటర్లు అమర్చుకున్నారు. మరోవైపు గుమడాం గ్రామానికి ఆనుకుని ఉన్న వేగావతి నది నుంచి టిడ్కో గృహ సముదాయానికి నీరు చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 18 బ్లాకుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగతా నాలుగు బ్లాకులకు గాను మూడు బ్లాకుల్లో శ్లాబు పనులు పూర్తయ్యాయి. మరో బ్లాక్ నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేస్తామని ఏఈ రాజీవ్ తెలిపారు. విద్యుత్, తాగునీరు, కాలువలు పనులు కూడా పూర్తికావొచ్చాయని.. త్వరలోనే ఇళ్ల ప్రారంభోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు.
సాలూరు టిడ్కో గృహ సముదాయానికి సంబంధించి 812 మంది డీడీ రూపంలో వేలాది రూపాయలు చెల్లించారు. అయితే కేవలం 132 మందికి మాత్రమే రూ.30.60 లక్షలు చెల్లించారు. ఇంకా 680 మందికి రూ. 26.67 లక్షలు చెల్లించాల్సి ఉంది. మిగతా లబ్ధిదారులు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఎదురుచూస్తున్నాం
టిడ్కో ఇళ్ల గృహప్రవేశం కోసం ఎదురు చూస్తున్నాం. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఎంతగానో సహకరించింది. అయితే వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్మాణాలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వ హయాంలోనైనా గృహాలను మాకు అప్పగిస్తే సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటాం.
- పి. మార్కండేయులు, టిడ్కో ఇళ్ల లబ్ధిదారుడు, పార్వతీపురం
================================
మా బాధను అర్థం చేసుకుని..
గృహ నిర్మాణాలు చేపట్టకపోయినా గతంలో మేము చెల్లించిన రూ.50 వేలు తిరిగి మాకు అందుతాయన్న సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం మధ్యతరగతి వర్గాల సొంతింటి కలనె నెరవేర్చలేకపోయింది. కూటమి ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకుని మేము చెల్లించిన డబ్బులను తిరిగి ఇస్తామనడం సంతోషంగా ఉంది.
- బి. సత్యనారాయణ, లబ్ధిదారుడు, పార్వతీపురం
================================
ఇల్లూ లేదు.. డబ్బులూ లేవు..
టిడ్కో గృహ సముదాయంలో డబుల్ బెడ్‌రూం ఇంటి కోసం రెండు విడతలుగా రూ.50 వేలు చెల్లించాం. అయితే ఇప్పటి వరకు మాకు ఇల్లు లేదు. డబ్బులు కూడా తిరిగి రాలేదు. ప్రభుత్వం స్పందించి మా డబ్బులు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
- కుసుమంచి వాణిశ్రీ , సాలూరు