Share News

పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:49 PM

జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా జాబితా విడుదలైంది. ఈ జాబితాను అన్ని పంచాయతీల్లో నోటీసు బోర్డుల వద్ద అధికారులు ఉంచారు.

  పోలింగ్‌ కేంద్రాల  ముసాయిదా జాబితా విడుదల
శిఖబడి పంచాయతీలో పోలింగ్‌ కేంద్రాల జాబితాను అతికిస్తున్న సిబ్బంది

-నోటీస్‌ బోర్డుల్లో ఉంచిన పంచాయతీ కార్యదర్శులు

- ఈ నెల 26లోగా అభ్యంతరాల సేకరణ

- 31న తుది ముసాయిదా జాబితా ప్రచురణ

జియ్యమ్మవలస, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా జాబితా విడుదలైంది. ఈ జాబితాను అన్ని పంచాయతీల్లో నోటీసు బోర్డుల వద్ద అధికారులు ఉంచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఎన్నికలు మరికొద్ది నెలల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 451 పంచాయతీలు, 4,128 వార్డులు ఉన్నాయి. సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాలను కళాశాలలు, పాఠశాలలు, కొన్ని చోట్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఇటీవల పరిశీలించారు. ఈ పోలింగ్‌ కేంద్రాల జాబితా, లొకేషన్‌ పరిశీలించి ఎటువంటి అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26లోగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శుల (పంచాయతీ సెక్రటరీ)కు తెలియజేయవచ్చని జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌.రవీంద్ర తెలిపారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. తదుపరి ఈ నెల 31న కలెక్టర్‌ ఫైనల్‌ పబ్లికేషన్‌ చేయనున్నారు. ఈ విషయమై జియ్యమ్మవలస ఎంపీడీవో సీహెచ్‌ హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘పోలింగ్‌ కేంద్రాలపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ప్రజలు పంచాయతీ కార్యదర్శులకు నిర్భయంగా తెలియజేయవచ్చు. వీటన్నిటిని ఖచ్చితంగా పరిశీలిస్తాం.’ అని అన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 11:49 PM