ప్రాణాలు పోతున్నా.. పట్టదా?
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:34 PM
జిల్లాలో కార్మికులకు భద్రత కరువైంది. ఒక్క బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో గత ఐదు సంవత్సరాల్లో 16 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
- కార్మికులకు భద్రత కరువు
- పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు
- మృత్యువాతపడుతున్న శ్రమజీవులు
- గత నెల మొదటి వారంలో బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లోని మెటల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో వికాష్‌కుమార్ అనే కార్మికుడు మృతిచెందాడు. మెటల్ వేసే ఇనుప గల్లా మీద పడడంతో చనిపోయాడు. ఈయన బిహార్‌కు చెందిన వ్యక్తి.
-గతనెల 21న బొబ్బిలి పారిశ్రామికవాడలో బెర్రీ ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్యాస్ లీకేజీ ఘటనలో సరోజ్‌పాల్ అనే కార్మికుడు 65 శాతం కాలిపోయాడు. యాదయ్య అనే మరో కార్మికుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. సరోజ్‌పాల్ పరిస్థితి విషమంగా ఉంది.
- ఈ ఏడాది జూన్ 17న రాజాం సీతారామ ఆయిల్ ఇండస్ర్టీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పులు ఎగసిపడి వ్యాపించడంతో మంటలు అల్లుకున్నాయి. దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే సామగ్రి కాలిపోయింది. తెల్లవారు కావడంతో.. కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
- గతంలో బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో బాలాజీ రసాయన పరిశ్రమలో ట్యాంకు పేలడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వచ్చి హడావుడి చేశారు. తరువాత చేతులు దులుపుకొన్నారు.
దాసన్నపేట, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కార్మికులకు భద్రత కరువైంది. ఒక్క బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో గత ఐదు సంవత్సరాల్లో 16 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇంకా వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, రాజాం ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్నాయి. అయితే చాలావరకూ మూతపడుతుండగా.. మిగిలిన వాటిలో కార్మికుల భద్రతకు సంబంధించి నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఒక్క పరిశ్రమల్లో పని చేస్తే కార్మికులు మాత్రమే కాదు. క్వారీ, భవన నిర్మాణ కార్మికులకు సైతం భద్రత కరువై మూల్యం చెల్లించుకుంటున్నారు.ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కండలు కరిగించి మండుతున్న యంత్రాల మధ్య పనిచేసే కార్మికుల బతుకులు దుర్భర స్థితిలోకి మారుతున్నాయి. కనీస వేతనాలు, సౌకర్యాలకు నోచుకోకపోగా.. భద్రత కరువై విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
జిల్లాలో 7.60 లక్షల మంది కార్మికులు..
జిల్లాలో అసంఘటితరంగంలో పనిచేసే కార్మికులు 7.60 లక్షల మంది ఉన్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో మాత్రం నమోదైన వారు సుమారుగా 5 లక్షల మంది ఉంటారు. పరిశ్రమల్లో యంత్రాల మధ్య పనిచేసే కార్మికులకు హీట్ రెసిస్టెంట్ ఆఫ్రాన్లు, గమ్‌బూట్లు, హెల్మెట్లు గ్లౌజులు విధిగా అందించాలి. అయితే వీటిని అందించడంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. క్షతగాత్రులుగా మారుతున్నారు. బాధితులకు నామమాత్రంగా పరిహారం అందించి యాజమాన్యాలు చేతులు దులుపుకొంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాత పడడం పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా కార్మిక శాఖ కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా కార్మికుల మూలవేతనం నుంచి 1.75 శాతం ఈఎస్‌ఐకి వెళ్తుంది. అటు యాజమాన్యాలు సైతం కొంత మొత్తాన్ని భరిస్తున్నాయి. కానీ ఈఎస్‌ఐ సేవలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. గరివిడిలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రి ప్రాథమిక సేవలకే పరిమితం అవుతుందన్న విమర్శ ఉంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కార్మికులను విశాఖ, విజయనగరం తరలించాల్సి వస్తోంది.
కానరాని తనిఖీలు
వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిశ్రమలను తనిఖీ చేయాలి. ఇన్‌స్పెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేయాలి. కానీ, ఈ అధికారులు ఎక్కడుంటారో చెప్పలేని పరిస్థితి. కనీసం కార్యాలయాల చిరునామా సైతం తెలియని దయనీయ దుస్థితి జిల్లాలో నెలకొంది. జిల్లాల విభజన జరిగినా.. ఈ కార్యాలయాలు మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతున్నాయి. తనిఖీలు చేస్తున్నారా? అంటే ప్రశ్నిస్తే శాఖల్లో సిబ్బంది కొరతగా చూపుతుంటారు. దీంతో పరిశ్రమల నిర్వహణలో యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శించడం, భద్రతాచర్యలు పాటించకపోవడం, కార్మిక చట్టాలను అమలుచేయకపోవడం వంటివాటితో కార్మికులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరముంది.
చర్యలు తీసుకోవడం లేదు..
జిల్లాలో కార్మికశాఖ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. పరిశ్రమలు మూతపడుతున్నా పట్టించుకోవడం లేదు. కార్మిక చట్టాలను అమలు చేయకపోయినా చర్యలు తీసుకోవడం లేదు. కనీసం పరిశ్రమల్లో భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసేందుకు కూడా ముందుకు రాకపోవడం దారుణం. ఇప్పటికైనా దృష్టిపెట్టాలి.
ఎ.జగన్మోహన్‌రావు, సీఐటీయూ జిల్లా కోశాధికారి, కార్మిక సంఘం నాయకుడు, విజయనగరం
భద్రత గాలికి..
కార్మికుల భద్రతను గాలికొదిలేస్తున్నారు. పరిశ్రమల వద్ద కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదు. క్వారీలు సైతం ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు కోల్పోయే సమయంలో రేటు కట్టి చేతులు దులుపుకొంటున్నారు. కార్మిక చట్టాలు అమలుకావడం లేదు. చనిపోతున్నా పరిహారం దక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలి.
-చిప్పాడ రాము, కార్మికుడు, విజయనగరం
కార్మిక సంక్షేమమే ప్రధానం
జిల్లాలో కార్మికుల సంక్షేమమే ప్రధానం. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు మృతి చెందిన, గాయాలు పాలైనా నష్టపరిహారాన్ని వైద్య ధృవీకరణ పత్రంతో పాటు, వయస్సుని అనుసరించి కంపెనీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తాం. రాష్ట్ర కమిషనర్ ఆదేశాలతోనే తనిఖీలు నిర్వహిస్తాం. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది.
-టి.సుజాత, కార్మికశాఖ ఉపకమిషనర్, విజయనగరం