Don't take it lightly తేలిగ్గా తీసుకోవద్దు
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:06 AM
Don't take it lightly క్షయ (టీబీ) జిల్లాను పట్టిపీడిస్తోంది. గతంతో పోల్చితే కేసులు కాస్త తగ్గినా పూర్తిగా అదుపులోకి రావడం లేదు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలికంగా దగ్గు వస్తుంటే సాధారణమే కదా అని చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు.
తేలిగ్గా తీసుకోవద్దు
జిల్లాలో తగ్గని క్షయ (టీబీ) కేసులు
ముందుచూపుతో మేలు
అందుబాటులో మెరుగైన వైద్యం
నేడు ప్రపంచ క్షయ నివారణ దినం
క్షయ (టీబీ) జిల్లాను పట్టిపీడిస్తోంది. గతంతో పోల్చితే కేసులు కాస్త తగ్గినా పూర్తిగా అదుపులోకి రావడం లేదు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలికంగా దగ్గు వస్తుంటే సాధారణమే కదా అని చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. రెండు వారాలకు మించి దగ్గు వేధిస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి కళ్లె పరీక్షలు చేయించుకోవాలి. ఆశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఆదిలోనే సరైన వైద్యం తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు చెబుతున్నారు.
విజయనగరం రింగురోడ్డు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
క్షయ వ్యాధి కారకమైన బ్యాక్టీరియా (మైకో బాక్టీరియం ట్యూబర్‌క్యూలోసిస్)ను డాక్టరు కోచ్ కనుగున్న తరువాత శతాబ్ది పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1942 నుంచి ఏటా మార్చి 24న ప్రపంచ టీబీ నివారణ దినం పాటించాలని నిర్ణయించింది. ఈ రోజున దేశవ్యాప్తంగా వ్యాధి తీవ్రతపై చర్చలు నిర్వహించడం.. నివారణ మార్గాలు సూచించడం.. భవిష్యత్తు కార్యాచరణకు వైద్యశాఖ ప్రణాళిక రూపొందించడం తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా దీర్ఘకాలింగా దగ్గు వస్తుంటే తేలిగ్గా తీసుకోకూడదు. రెండు వారాలకు మించి దగ్గు వేధిస్తుంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కళ్లె పరీక్ష చేయించుకోవాలి. దీర్ఘకాలిక దగ్గు క్షయ లక్షణం కావచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో పరీక్ష చేయించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందజేస్తున్న ఔషధాలను సకాలంలో వాడితే వ్యాధి తప్పకుండా నయమౌతుంది. లేని పక్షంలో మొండిగా మారి కొన్ని సందర్భాల్లో ప్రాణాలను హరించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
లక్షణాలు ఇవే
రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతిలో నొప్పి, కపంలో రక్తపు జీరలు పడడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసటగా ఉండడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ప్రధానంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు మధుమేహ వ్యాధిగ్రస్తులు, పొగ, ఇతర మత్తుపదార్థాలు వాడేవారిలో టీబీ ఎక్కువగా కన్పిస్తుంది.
జిల్లాలో కేసులు ఇలా
సంవత్సరాలు 2023 2024 2025
సాధారణ క్షయ కేసులు 3,072 2,638 2,438
ఔషధ నిరోధక కేసులు 88 62 66
===========
2023 సంవత్సరంలో టీబీ వ్యాధి వల్ల 131 మంది మరణించగా, 2024 సంవత్సరంలో 149 మంది, 2025 సంవత్సరంలో 104 మంది మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది.
నిర్ధారణ ఇలా
క్షయ వ్యాధి నిర్ధారణకు పలు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌రే, సీబీనాట్ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. అన్ని సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లోనూ టీబీ నిర్దారణ పరీక్షలు చేస్తారు. మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని టీబీ కేంద్రంలో కాట్రిజ్డ్ బేస్డ్ యూక్లీక్ యాసిడ్, యాంప్లిఫికేషన్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. టీబీ నిర్ధారణ జరిగిన రోగులకు ఔషదాలను ఆరు నెలల పాటు ఉచితంగా అందజేస్తారు. ఈ ఔషదాలను క్రమం తప్పకుండా వాడితే పూర్తిగా తొలగిపోతోంది. అలాగే వీరికి పోషకాహరం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి నెల వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు.
అవగాహనతోనే నివారణ
డాక్టరు ఎస్ జీవనరాణి, డీఎంహెచ్‌ఓ, విజయనగరం
అవగాహనతోనే క్షయ వ్యాధిని నిర్మూలించవచ్చు. టీబీ నిర్ధారణకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేసి ఔషధాలు అందజేస్తున్నాం. ఎవరికైనా రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, చాతిలో నొప్పి లక్షణాలు కన్పిస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. టీబీ వ్యాధికి నేడు అత్యాధునిక వైద్యం, పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. టీబీ నిర్మూలనకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది.
క్షయపై అప్రమత్తం
డాక్టరు బి.సంతోష్, పల్మానాలజిస్ట్, ప్రభుత్వ సర్వజనాసుపత్రి, విజయనగరం
జిల్లాలో క్షయ నియంత్రణలో మెరుగైన ఫలితాలు కన్పిస్తున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకం. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యం చేస్తే ఈ వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. టీబీ చికిత్సలో మందులు మధ్యలో ఆపడం వల్ల ప్రమాదం పెరుగుతుంది. పూర్తి కోర్సును వాడడం తప్పనిసరి.