వన్‌టైం వండర్‌గా మిగిలిపోకూడదు
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:44 PM
ప్రజాప్రతినిధులు వన్‌టైం వండర్‌గా మిగిలిపోకూడదని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు.
- పాలన కన్నా సమయపాలన మిన్న
- ఓ కీలక నేతను ఉద్దేశించి గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలు
విజయనగరం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులు వన్‌టైం వండర్‌గా మిగిలిపోకూడదని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు మరికొంతమంది ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలుగా నియమితులైన గంట్యాడ శ్రీదేవి తన నియోజకవర్గ నాయకులతో శుక్రవారం అశోక్‌గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ‘నేను ప్రజాప్రతినిదిగా ఉన్న సమయంలో ఏ కార్యక్రమానికైనా అధికారులకన్నా ముందే హాజరయ్యేవాడిని. దీంతో అధికారులు కూడా ఆదే సమాయానికి వచ్చేవారు. క్రికెట్‌ను చూడడానికి టైమ్‌కి టీవీ ఆన్‌చేస్తాం. ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంత సమయం ముందే రైల్వేస్టేషన్‌కు చేరుకుంటాం. అలాంటిది సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు నాయకులు ఎందుకు సమయానికి వెళ్లలేకపోతున్నారు. అనుకున్న సమయానికి సభాస్థలి వద్ద ప్రజాప్రతినిధులు ఉండాలి. జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు సమయపాలన పాటించడం లేదు. ఓ కీలక నేత పాఠశాలలో జరిగే కార్యక్రమానికి రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. అప్పటి వరకూ చిన్నారులు ఎండలో నిలబడిన తీరు నా దృష్టికి రావడం కలవరపరిచింది. ఆయన మంచి వ్యక్తే. కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు ముందుగానే చేరుకుంటే ఇబ్బందులు ఉండవు. మంత్రిగా, ప్రజాప్రతినిధిగా రాజకీయ రంగంలో నిలబడాలంటే క్రమశిక్షణతో పాటు హుందాతనం కనబర్చాలన్నదే నా కోరిక. కుటుంబ పెద్దలకు మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా కొండపల్లి నడవడిక ఉండాలన్నదే మా ఆకాంక్ష’ అని అశోక్‌గజపతిరాజు అన్నారు. అయితే మంత్రి కొండపల్లి సమయపాలన పాటిస్తున్నారని కొందరు అశోక్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అశోక్ స్పందిస్తూ.. తన ఉద్దేశం కొండపల్లికి ఇంకా 30 ఏళ్ల భవిష్యత్తు ఉందని, రాజకీయాల్లో రాణించాలంటే సమయపాలన అత్యంత ప్రధానమన్నదే తన మాటల ఉద్దేశమని వివరించారు.