జనాభా గణనపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:29 PM
జనాభా గణన-2027 ప్రక్రియలో భాగంగా మొదటి విడతగా చేపట్టనున్న గృహ గణనలో నిర్లక్ష్యం పనికిరాదని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఎన్యుమరేటర్లకు స్పష్టం చేశారు.
- ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటినీ సందర్శించాలి
- జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి
కురుపాం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): జనాభా గణన-2027 ప్రక్రియలో భాగంగా మొదటి విడతగా చేపట్టనున్న గృహ గణనలో నిర్లక్ష్యం పనికిరాదని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఎన్యుమరేటర్లకు స్పష్టం చేశారు. గురువారం కురుపాంలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ పాల్గొని మాట్లాడారు. దేశ ప్రగతి, భవిష్యత్తు, ప్రణాళికల రూపకల్పనకు జనాభా గణన అత్యంత కీలకమని అన్నారు. ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటినీ సందర్శించి, ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. గృహాల జాబితా నమోదులో అనుసరించాల్సిన సాంకేతిక పద్ధతులు, మొబైల్ యాప్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సూపర్‌వైజర్లు తమ పరిధిలోని ఎన్యుమరేటర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, సమాచార సేకరణలో నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశించారు. మండల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి నిర్ణీత గడువులోగా మొదటి విడత గణనను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయ, గణాంక శాఖ అధికారులు, ఎన్యుమరేటర్ల, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.