Don't invite trouble upon yourself. కష్టం ‘కొని’తెచ్చుకోవద్దు
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:43 PM
Don't invite trouble upon yourself. జిల్లాలో మైనర్ బాలుర బైక్ డ్రైవింగ్ ఎక్కువవుతోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ద్విచక్ర వాహనాలపై కనిపిస్తున్నారు. పోలీసులు చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్లే మైనర్లు వాహనాలపై రోడ్లపైకి వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి
కష్టం ‘కొని’తెచ్చుకోవద్దు
మైనర్ల చేతిలో బైకులు!
చిన్న వయసులో భారీ మూల్యం
ఏటా పెరుగుతున్న ప్రమాదాలు
కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు
తల్లిదండ్రులపై కేసులు నమోదుచేస్తామంటున్న ఎస్పీ
- మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తాం. వాహనాల డిజైన్లను మార్చడం, సైలెన్సర్ల మార్పు వంటివి చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే సీజ్ చేస్తాం. తల్లిదండ్రులతో పాటు వాహనాలు ఇచ్చేవారిపై కేసులు నమోదుచేస్తాం.
- ఇటీవల వాహనాలతో పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులకు ఎస్పీ దామోదర్ చేసిన హెచ్చరిక.
విజయనగరం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో మైనర్ బాలుర బైక్ డ్రైవింగ్ ఎక్కువవుతోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ద్విచక్ర వాహనాలపై కనిపిస్తున్నారు. పోలీసులు చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్లే మైనర్లు వాహనాలపై రోడ్లపైకి వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది జూన్‌లో బొండపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఆ ముగ్గరు రెండు పదుల వయసువారే. మే నెలలో డెంకాడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఆ ఇద్దరూ చిన్నవయస్కులే. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత, బాలురు ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లాడు మారం చేశాడానో.. అలుగుతున్నాడనో బైక్‌లు కొనిచ్చి చేతిలో పెడితే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల పల్లెల్లో సైతం పట్టణ సంస్కృతి విస్తరిస్తోంది. ప్రతి ఇంటా ద్విచక్ర వాహన వినియోగం పెరుగుతోంది. మైనర్లు సైతం బైక్ డ్రైవింగ్ చేస్తున్నారు. వారిని కుటుంబసభ్యులు నిలువరించే ప్రయత్నం చేయడం లేదు.
ఆందోళనకరంగా ప్రమాదాలు
జిల్లాలో ఇటీవల ఏదోచోట ప్రమాదం జరుగుతునే ఉంది. హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణాలు చేయడం, అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మైనర్ల వాహనాలు నడపడం వంటి కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే తాము మాత్రం కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది ఏకంగా 60వేల వరకూ కేసులు నమోదు చేసినట్టు చెబుతున్నారు. అయినా ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 2022లో జరిగిన ప్రమాదాల్లో 244 మంది మృతిచెందారు. 925 మంది క్షతగాత్రులయ్యారు. 2023లో 213 మంది చనిపోతే 826 మంది క్షతగాత్రులయ్యారు. 2024లో 166 మంది మృతిచెందితే 695 మంది క్షతగాత్రులయ్యారు. 2025లో 208 మంది చనిపోయారు. 550 మంది వరకూ క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది 10 నెలల కాలంలో దాదాపు 180 మంది వరకూ చనిపోయి ఉంటారని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి.
- చాలామంది తల్లిదండ్రులు పిల్లల నడవడికపై దృష్టిసారించడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ..ప్రమాదాలు జరిగి మూల్యం చెల్లించుకున్న తరువాత అయ్యో పాపం అని బాధపడుతున్నారు. సాధారణంగా ద్విచక్ర వాహనం ప్రతి ఇంటికి అవసరమే. కానీ పిల్లలు కోరిందే తడవుగా స్పోర్ట్స్ బైక్‌లు కొనిచ్చేస్తున్నారు. ఇలా బైక్‌లు సమకూర్చిన తరువాత చాలా మంది పిల్లలపై దుష్ట్రభావం పడుతోంది. చెడు సావాసాలు పెరుగుతున్నాయి. చాలారకాల వ్యసనాలు తోడవుతున్నాయి.
పెరుగుతున్న స్పోర్ట్స్ బైకులు
జిల్లాలో కుర్రకారుకు బ్రేకులు పడడం లేదు. సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కువ మంది బైక్ రైడింగ్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. స్పోర్ట్స్ బైక్‌లు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల్లో ప్రతి ఇంటా రేస్‌బైక్‌లు, స్పోర్ట్స్ బైకులు దర్శనమిస్తున్నాయి. విజయనగరంలో సిటీ కల్చర్ పెరిగింది. స్పోర్ట్స్ బైకులు ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు.