Share News

Don't dismiss it as just a minor injury. చిన్న గాయమే.. అనుకోవద్దు

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:17 AM

Don't dismiss it as just a minor injury. చిన్న గాయమే అని నిర్లక్ష్యం చేస్తే... ఆ విష క్రిమి ప్రాణాలనే బలి తీసుకుంటుంది. రేబీస్‌ వ్యాధి తీవ్రతను చాటి చెప్పే చేదు నిజమిది. పెంపుడు జంతువులు లేదా వీఽధి కుక్కలు కరిచినప్పుడు తగిన చికిత్స చేసుకోకపోవడంతో ఏటా వేల సంఖ్యలో ప్రజలు ఈ భయంకరమైన వ్యాధి బారిన పడుతున్నారు.

Don't dismiss it as just a minor injury. చిన్న గాయమే.. అనుకోవద్దు

చిన్న గాయమే.. అనుకోవద్దు

కుక్కకాటుకు వెంటనే చికిత్స అవసరం

అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకమంటున్న వైద్యులు

నేడు ప్రపంచ రేబీస్‌ వ్యతిరేక దినం

విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): చిన్న గాయమే అని నిర్లక్ష్యం చేస్తే... ఆ విష క్రిమి ప్రాణాలనే బలి తీసుకుంటుంది. రేబీస్‌ వ్యాధి తీవ్రతను చాటి చెప్పే చేదు నిజమిది. పెంపుడు జంతువులు లేదా వీఽధి కుక్కలు కరిచినప్పుడు తగిన చికిత్స చేసుకోకపోవడంతో ఏటా వేల సంఖ్యలో ప్రజలు ఈ భయంకరమైన వ్యాధి బారిన పడుతున్నారు. రేబీస్‌ ఒకసారి శరీరంలోకి ప్రవేశించాక యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోకపోతే అది ప్రాణంతకంగా మారుతుంది. దానిని వ్యాక్సిన్‌తో నిరోధించాలి తప్ప ఎటువంటి ఇతర చికిత్సలు లేవని వైద్యులు చెబుతున్నారు. కాని చాలా మంది కుక్కలు కరిచినప్పుడు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. రేబిస్‌పై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు నివారణ చర్యలను వేగవంతం చేసేందుకు ఏటా సెప్టెంబరు 28న ప్రపంచ రేబీస్‌ వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తున్నారు.

ఫ రేబీస్‌ అనేది ఓ ప్రమాదకరమైన ‘రాబ్దోవైరస్‌’ వల్ల కలిగే నాడీ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌. కుక్కలు, పిల్లులు, కోతులు లేదా ఇతర గబ్బిలాలు కరిచినా వాటి లాలాజలం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్‌ నరాల ద్వారా నేరుగా మెదడుపై దాడి చేస్తుంది.

లక్షణాలు ఇవే

వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తరువాత లక్షణాలు బయటపడడానికి రోజుల నుంచి కొద్ది నెలల సమయం పట్టవచ్చు. ప్రధానంగా రేబీస్‌ సోకిన వ్యక్తిలో నీటిని చూస్తే భయం(హైడ్రో ఫోబియా), వెలుతురు, గాలిని తాకితే పక్షవాతం లేదా ఫిట్స్‌ వచ్చినట్టు ప్రవర్తిస్తారు. తీవ్ర మైన జ్వరం, మంట లేదా తిమ్మిరి, తీవ్ర ఆందోళన, అసాధారణ ప్రవర్తన కలుగుతుంది.

చికిత్సతో నివారణ

రేబీస్‌ వ్యాధి ముదిరి లక్షణాలు బయట పడిన తరువాత దానికి ఖచ్చితమైన విరుగుడు లేదు. కాబట్టి జంతువులు కరిచిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వందశాతం నివారించవచ్చు. కరిచిన భాగాన్ని ప్రవాహ నీరు, సబ్బుతో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రంగా కడగాలి. గాయంపై కారం, సున్నం వంటివి రాయకూడదు. వైద్యుడ్ని సంప్రందించి కరిచిన మొదటి రోజే వాక్సిన్‌ తీసుకోవాలి. ఆ తరువాత 3, 7, 14, 28 రోజుల్లో తప్పనిసరిగా మిగిలిన డోస్‌లు పూర్తి చేయాలి. పెంపుడు కుక్కలకు, పిల్లులకు క్రమం తప్పకుండా యాంటీ రాబీస్‌ టీకాలు వేయించాలి.

జిల్లాలో రేబీస్‌ కేసులు ఇలా

సంవత్సరం నమోదైన కేసులు మరణాలు

2023 10,662 1

2024 12,767 4

2025 13,390 8

2026 (జూన్‌ వరకూ) 14,211 3

================

టీకాతోనే రేబీస్‌కు చెక్‌

డాక్టరు ఎస్‌.జీవనరాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

రేబీస్‌ నివారణ వ్యాక్సిన్‌తోనే సాధ్యం. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ రేబీస్‌ వ్యాక్సిన్‌(ఎఆర్‌వీ)లు అందుబాటులో ఉన్నాయి. జంతువులు ఏమైనా కరిచినప్పుడు నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా సమీప ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి ఉచితంగా లభించే టీకాలను తీసుకోవాలి. కుక్క, పిల్లి, కోతి లేదా ఇతర జంతువులు కరిచినా తక్షణమే గాయాన్ని ప్రవాహ నీరు, సబ్బుతో 15 నిమిషాలు పాటు శుభ్రంగా కడగడం వల్ల వైరస్‌ తీవ్రత గణనీయంగా తగ్గుతుంది.

జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి

డాక్టరు ఎస్‌.మన్మథరావు, జేడీ, పశు సంవర్థకశాఖ, విజయనగరం

జిల్లావ్యాప్తంగా రేబీస్‌ వ్యాధి నియంత్రణకు పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. పెంపుడు కుక్కలు, పిల్లులకు యజమానులు తప్పనిసరిగా క్రమం తప్పకుండా యాంటీ రేబీస్‌ టీకాలు వేయించాలి. దీనివల్ల మానవాళికి రేబీస్‌ ముప్పును అరికట్టవచ్చు. మూగజీవాల్లో ఏమైనా అసాధారణ ప్రవర్తన లేదా పిచ్చి వంటి ఉన్మాద లక్షణాలు కన్పిస్తే వెంటనే సమీప పశు వైద్యునికి సమాచారం అందించాలి.

నేడు పెంపుడు శునకాలకు ఉచిత రేబిస్‌ టీకాలు

విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ రేబీస్‌ నివారణ దినాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక బహుళార్థ పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు ఉచితంగా రేబీస్‌ టీకాలు వేయనున్నట్టు పశు సంవర్థకశాఖ జాయింట్‌ డైరక్టరు డాక్టరు ఎస్‌.మన్మథరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఉచితంగా వ్యాక్సిన్‌ వేయనున్నట్టు పేర్కొన్నారు. అలాగే వ్యాధి నివారణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన సదస్సును కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. జంతు ప్రేమికులు, పెంపుడు శునకాలు, పిల్లుల యాజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

----------------------

Updated Date - Sep 28 , 2026 | 12:17 AM