dont care for drinking! తాగడంలో తగ్గేదేలే!
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:43 PM
dont care for drinking! జిల్లాలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత వార్షిక సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి తరువాత ఊపందుకున్నాయి.
తాగడంలో తగ్గేదేలే!
జిల్లాలో పెరిగిన మద్యం, బీర్ల విక్రయాలు
గత ఏడాదితో పోల్చితే గణనీయం
ఇంకా ఉన్నది నాలుగు నెలలే
అక్టోబరులో ముగియనున్న టెండర్ల గడువు
ఈసారి పెరగనున్న దరఖాస్తులు
విజయనగరం, జూన్ 8(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత వార్షిక సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది. నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి తరువాత ఊపందుకున్నాయి. ఒక్క జనవరి నెలలో 2,06,557 మద్యం కేసులు అమ్ముడయ్యాయి. బీర్లు అయితే 1,25,076 కేసులు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరిలో మద్యం కేసులు 1,59,666, బీర్ల కేసులు 97,274...మార్చిలో 1,81,796 మద్యం కేసులు, 1,18, 495 బీర్ల కేసులు అమ్ముడయ్యాయి. ముందు ఏడాదితో పోల్చితే రెట్టింపు అయ్యాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 192 మద్యం దుకాణాలు ఉండగా మరో 22 బార్లు కొనసాగుతున్నాయి. బీర్ల అమ్మకాలు సైతం వేసవిలో జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది నవంబరు, డిసెంబరు, జనవరిలో తగ్గుముఖం పట్టాయి కానీ సంక్రాంతి తరువాత అంటే ఫిబ్రవరి నుంచి ఊపందుకున్నాయి. ఏప్రిల్, మే నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ముఖ్యంగా మద్యం షాపుల చెంతనే పర్మిట్ రూములకు అనుమతివ్వడంతో మద్యం అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పర్మిట్ రూములతోనూ ప్రభుత్వానికి మద్యం ఆదాయం పెరిగింది. కార్పొరేషన్ పరిధిలో రూ.7.50 లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ.5 లక్షలకు పర్మిట్ రూముల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
నాలుగు నెలల్లో..
మద్యం దుకాణాలకు ఇంకా నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. అక్టోబరుతో మద్యం షాపుల టెండర్ల గడువు ముగియనుంది. దీంతో కొత్త టెండర్లు ఖరారు చేయనున్నారు. అయితే పాత వాటికే నిర్ణీత డిపాజిట్లు చేయించుకొని టెండరు కొనసాగించే అవకాశం ఉంది. 2024 అక్టోబరులో జనాభా ప్రతిపాదికన రూ.55 లక్షలుగా లైసెన్స్ ఫీజు కింద వసూలు చేశారు. విజయనగరం నగరపాలక సంస్థలో రూ.65 లక్షలు వసూలు చేశారు.అయితే మద్యం అమ్మకాలు గణనీయంగా పెరగడంతో మరోసారి షాపులకు వ్యాపారులు ఎగబడే అవకాశం ఉంది.
నిబంధనలు బేఖాతరు
మద్యం షాపు వద్ద నిబంధనలు పాటించడం లేదు. ఒక వ్యక్తికి రెండుకు మించి సీసాలను అమ్మకూడదు. 21 సంవత్సరాల్లోపు వారికి మద్యం విక్రయించకూడదు. కానీ వయసుతో సంబంధం లేకుండా ఎవరికి ఎన్ని సీసాలు అమ్ముతున్నారో లెక్కేలేదు. జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. మండలంలో కనిష్టంగా ఐదు వరకూ షాపులను ఏర్పాటుచేశారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 7 నుంచి 10 వరకూ షాపులు ఏర్పాటయ్యాయి. అయితే కొన్ని షాపుల్లో రోజువారీ విక్రయాలు అధికంగా ఉన్నాయి. మరికొన్ని వాటిలో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగడం లేదు. అయితే విక్రయాలు తక్కువగా ఉన్నచోట ‘బెల్ట్’ను ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
అక్టోబరు వరకే గడువు
మద్యం అమ్మకాలు పెరిగిన మాట వాస్తవమే. ముఖ్యంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. అక్టోబరుతో టెండర్ల గడువు ముగుస్తుంది. బెల్టు దుకాణాలు లేకుండా నియంత్రిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు మద్యం అమ్మితే చర్యలు తప్పవు.
- శ్రీనాథుడు, జిల్లా ఎక్సైజ్ అధికారి, విజయనగరం
==============