వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:20 PM
పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.
- విధులపై అలసత్వం వహిస్తే సహించేది లేదు
- పార్వతీపురం మన్యం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
సీతంపేట రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఎన్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. ఈ మేరకు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 73 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినతులను సత్వరమే పరిశీలించి నిబంధనల ప్రాప్తికి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు ప్రదర్శిస్తున్న అలసత్వంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. కొన్ని సమస్యలు కాగితం మీద, టెక్నికల్‌గా పరిష్కారం అయినట్లు అధికారులు చూపిస్తున్నారని అన్నారు. కానీ అర్జీదారునికి ఈ విషయం తెలియక మళ్లీమళ్లీ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది సరైన పద్ధతికాదని, అర్జీదారునికి నేరుగా ఫోన్‌చేసి సమస్య పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రాప్తికి ఆ సమస్య పరిష్కారం కానట్లయితే ఎందుకు పరిష్కారం కాలేదో అర్జీదారునికి స్పష్టంగా వివరించాలని ఆదేశించారు. ప్రతీ అధికారి రోజుకు కనీసం 2నుంచి 3గంటల సమయాన్ని గ్రీవెన్స్, అర్జీల పరిశీలనకు కేటాయించాలని సూచించారు. ప్రతీ వారం వచ్చిన మొత్తం అర్జీలు, పరిష్కరించినవి, అనుకూలంగా ఉన్నవి, తిరస్కరించిన వాటి పూర్తి సమాచారాన్ని అర్జీదారుల ఫీడుబ్యాక్‌తో సహా గ్రూప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రతిబింబించేలా మంగళవారం ఉదయం 9గంటలకు విజయోత్సవ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గత రెండేళ్లలో తమ శాఖల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్, డీఎంహెచ్‌వో భాస్కరరావు, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.