Share News

Don’t Be Negligent.. అలసత్వం వహించొద్దు..

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:52 PM

Don’t Be Negligent.. శంబర జాతర ఉత్సవాల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అలసత్వం వహిస్తే సహించేది లేదని సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి తెలిపారు. శుక్రవారం సాయంత్రం శంబర చదురుగుడి క్యూలైన్ల ఆవరణలో పలు శాఖల అధికారులతో సమీక్షించారు.

Don’t Be Negligent.. అలసత్వం వహించొద్దు..
అధికారులతో సమీక్షిస్తున్న సబ్‌ కలెక్టర్‌ వైశాలి

మక్కువరూరల్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): శంబర జాతర ఉత్సవాల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అలసత్వం వహిస్తే సహించేది లేదని సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి తెలిపారు. శుక్రవారం సాయంత్రం శంబర చదురుగుడి క్యూలైన్ల ఆవరణలో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఈనెల 26 నుంచి జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలమాంబను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు గట్టి నిఘా పెట్టాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో ఆటంకం కలగరాదని, సిరిమానోత్సవం పూర్తయిన వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతు పనులను ఆదివారం నాటికి పూర్తి చేయాలని తెలిపారు. గ్రామంలో షాపులు పెట్టుకోవాలనువాకి అనుమతులి వ్వాలన్నారు. వారి నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి జాతర నిర్వహణకు వినియోగించాలని చెప్పారు. జాతరను నాలుగు జోన్లుగా విభజిస్తున్నామని, జోన్‌కు ఒక అధికారిని నియ మిస్తున్నామని తెలిపారు. నాలుగుజోన్లకు సంబంధించిన అధికారులు ప్రధాన కంట్రోల్‌రూములో అందుబాటులో ఉండాలన్నారు. వనం, చదురుగుడుల వద్ద భక్తుల మధ్య తోపులాట జరగకుండా చూసుకోవాలన్నారు.

ఏర్పాట్ల పరిశీలన

చదురుగుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు, క్యూలైన్లను ఈవో శ్రీనివాస్‌, ట్రస్ట్‌ బోర్డుచైర్మన్‌ చినతిరుపతి శుక్రవారం పరిశీలించారు. రూ.100 టికెట్‌ తీసుకున్న వారికి రెండు క్యూలైన్లు, రూ.20 టికెట్‌ వారికి నాలుగు క్యూలైన్లు , ఉచిత దర్శనానికి మరో ఏడు క్యూలైన్లు సిద్ధం చేశామని వారు తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, చంటిపిల్లలకు పాలు సరఫరా చేస్తామని, బాలింతలకు ఒక రూమును ఏర్పాటు చేశామని వెల్లడించారు. నాలుగు కౌంటర్ల ద్వారా అమ్మవారి ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు.

సిరిమాను గుర్తింపు

ఈ ఏడాది పండాయవలస వద్ద చింతల అప్పలనాయుడు పొలంలో సిరిమాను(తాడికర్ర) గుర్తించామని, ఆదివారం దానిని శంబర తరలిస్తామని వారు చెప్పారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో విధులు నిర్వహించేందుకు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం నుంచి సుమారు 60మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. ఈ ఏడాది 22వేల లడ్డూలను తయారు చేయనున్నామని వెల్లడించారు.

Updated Date - Jan 23 , 2026 | 11:52 PM