Share News

అమ్మ ‘భౌ’బోయ్‌!

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:40 PM

dogs “Bow-Bow!” జిల్లా కేంద్రవాసులను వీధి కుక్కలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పార్వతీపురం పట్టణంలోని 36 వార్డుల్లో అవి గుంపుగా సంచరిస్తూ.. ప్రజలు, వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. చిన్నా, పెద్దా అన్న లేకుండా కనిపించే ప్రతిఒక్కరిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వీధి కుక్కల కారణంగా చాలామంది ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాహనదారులు కూడా తరచూ ప్రమాదాలకు గురువుతున్నారు. వీధుల్లో ఆడుకునే చిన్నారులు సైతం కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రిపాలవుతున్నారు.

 అమ్మ ‘భౌ’బోయ్‌!
పార్వతీపురం వీధుల్లో గుంపుగా తిరుగుతున్న కుక్కలు

  • గుంపుగా సంచరిస్తూ.. కనిపించిన వారిపై దాడి

  • రోజురోజుకూ పెరుగుతున్న కుక్కకాటు బాధితులు

  • మున్సిపల్‌ నూతన పాలవర్గం, అధికారులు స్పందించాలని విన్నపం

పార్వతీపురం టౌన్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రవాసులను వీధి కుక్కలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పార్వతీపురం పట్టణంలోని 36 వార్డుల్లో అవి గుంపుగా సంచరిస్తూ.. ప్రజలు, వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. చిన్నా, పెద్దా అన్న లేకుండా కనిపించే ప్రతిఒక్కరిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వీధి కుక్కల కారణంగా చాలామంది ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాహనదారులు కూడా తరచూ ప్రమాదాలకు గురువుతున్నారు. వీధుల్లో ఆడుకునే చిన్నారులు సైతం కుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రిపాలవుతున్నారు. గత నెల నుంచి ఇప్పటి వరకు పట్టణంలోని సుమారు 72 మంది కుక్కల దాడిలో గాయపడి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. గత ఏడాది సెప్టెంబరులో మణికంఠ కాలనీకి చెందిన జి.లోహిత్‌ ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ వీధి కుక్క దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన లోహిత్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు ప్రతినెలా 20 నుంచి 30 మంది వీధి కుక్కల దాడికి గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొన్నాళ్లుగా ఇలా ఎంతోమంది క్షతగాత్రులవుతున్నా.. మృత్యువాత పడుతున్నా.. వీధి కుక్కల కట్టడికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ‘పుర’ ప్రజలు మండిపడుతున్నారు.

- వాస్తవంగా ఐదేళ్ల కిందట ప్రజారోగ్య, పశుసంవర్థక శాఖలు వీధి కుక్కల దాడులను నివారించేందుకు చర్యలు చేపట్టారు. బ్లూక్రాస్‌ సంస్థ నిబంధనలకు అనుగుణంగా సుమారు 600లకు పైగా వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేశారు. దీంతో కొంతవరకు ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. అయితే ఇటీవల కాలంలో మళ్లీ కుక్కల సంఖ్య పెరగడంతో జిల్లాకేంద్రవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై కలెక్టర్‌, బ్లూక్రాస్‌ సంస్థ ప్రతినిధులతో పాటు మున్సిపల్‌ నూతన పాలకవర్గం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

బిక్కుబిక్కుమంటూ రాకపోకలు

వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలు, వాహనదారులపై దాడి చేస్తున్నాయి. దీంతో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. తరచూ విద్యార్థులు, పెద్దలపై కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా.. ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

- ఎన్‌.గోపి, పార్వతీపురం

==========================

బయటకు వెళ్లలేకపోతున్నాం

కూలి పనులు చేసుకుని బతికే మాలాంటి వారిపై తరచూ వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి. అవి వీధుల్లో గుంపులుగా తిరుగుతుండడంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేకపోతున్నాం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలి.

- ఆర్‌. రాములు కొత్తవలస, పార్వతీపురం

==========================

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తాం..

వీధి కుక్కల నివారణకు సంబంధించి ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించినంతరం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. బ్లూక్రాస్‌ సంస్థ సభ్యులు కూడా సహాయ సహకారాలు అందించాలి. వీధి కుక్కల వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

- రామ్‌గోపాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌, పార్వతీపురం

Updated Date - Nov 18 , 2026 | 11:40 PM