Share News

Does the budget provide assurance? బడ్జెట్‌ భరోసా ఇస్తుందా!

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:14 AM

Does the budget provide assurance? జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు రైతులకు భరోసాగా నిలువకపోగా కన్నీటి ఘోషకు దర్పణం పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు. వెరసి వ్యవసాయాధారిత జిల్లాలో సాగునీటి కోసం రైతులు యాతన పడాల్సిందే.

Does the budget provide assurance? బడ్జెట్‌ భరోసా ఇస్తుందా!

బడ్జెట్‌ భరోసా ఇస్తుందా!

దశాబ్దాలుగా సాగునీటి ప్రాజెక్టుల క‘న్నీటి’ ఘోష

సేద్యానికి నీరు ఇవ్వలేని స్థితిలో జలాశయాలు

పరిశ్రమలకు భరోసా కరువు

పాడైన రహదారులు

వైద్యానికీ ఇబ్బందులు

గిరిజన వర్సిటీకి నీడ కరువు

నిధులిస్తేనే గాడిన పడే అవకాశం

రేపు అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశం

జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు రైతులకు భరోసాగా నిలువకపోగా కన్నీటి ఘోషకు దర్పణం పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించినా.. పెరిగిన వ్యయంతో ఏ మూలకూ చాలడం లేదు. వెరసి వ్యవసాయాధారిత జిల్లాలో సాగునీటి కోసం రైతులు యాతన పడాల్సిందే. వేలాది ఎకరాలకు వర్షాధారమే దిక్కు. మరోవైపు పారిశ్రామిక రంగం కూడా తిరోగమనంలో ఉంది. మూతపడిన పరిశ్రమలేవీ తెరుచుకోవడం లేదు. ప్రధానంగా జూట్‌, ఫెర్రో పరిశ్రమలకు పూర్వ వైభవం వస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మౌలిక సౌకర్యాల్లో కీలకమైనవిగా చెప్పుకునే రహదారుల దుస్థితి మారాల్సి ఉంది. అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రతిష్ఠాత్మక గిరిజన యూనివర్సిటీకి నేటికీ ఓ రూపు దక్కలేదు. ఇంకా విజయనగరంలోని తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి ప్రభావం విద్యార్థుల ప్రవేశాలపై పడుతోందంటున్నారు. ఇవి కాకుండా ఇతర రంగాల్లోనూ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ గాడిన పడాలంటే బడ్జెట్‌లో కేటాయింపులు కీలకం. జిల్లాకు అత్యధికంగా నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై నమ్మకం పెట్టుకున్నారు. మరి ఎంత మేర ఊరట ఇస్తుందో చూడాలి.

విజయనగరం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు ఈసారి సంతృప్తిగా ఉంటుందని రైతులు కొండంత ఆశతో ఉన్నారు. తోటపల్లి, తారకరామ తీర్థసాగర్‌, మడ్డువలస, వెంగళరాయసాగర్‌, నారాయణపురం, ఆండ్ర ప్రాజెక్టుల వద్ద ఆధునికీకరణ, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. వీటిని పూర్తిస్థాయిలో తీర్చిదిద్ది అందుబాటులోకి తెస్తే జిల్లాలో సాగునీటి కొరత తీరి వ్యవసాయం పండుగగా మారుతుంది. కానీ ప్రాజెక్టులన్నీ పెరుగుతున్న అంచనా వ్యయం, నిర్మాణ భారంతో మూడడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్నట్టు ఉన్నాయి.

- రెండు దశాబ్దాలుగా తారకరామతీర్థ సాగర్‌ కొలిక్కిరావడం లేదు. అప్పట్లో అంచనా వ్యయం కేవలం రూ.220.04 కోట్లు కాగా ప్రస్తుతం రూ.808.34 కోట్లకు పెరిగింది. ఇటు సేద్యానికి..అటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నీరు సరఫరా చేసే ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను కూటమి ప్రభుత్వం గుర్తించింది. కాంట్రాక్టర్లకు రూ.20 కోట్ల బకాయిలు చెల్లించింది. గత వార్షిక బడ్జెట్‌లో రూ.68 కోట్లు కేటాయించింది. ఈ 20 సంవత్సరాల్లో సగం పని మాత్రమే జరిగింది. సారిపల్లి వద్ద సర్‌ప్లస్‌వియర్‌ నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలంటే మూడు గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ కింద పునరావాసం కల్పించాలి. ఇంకా 225.26 ఎకరాల భూసేకరణ చేపట్టాలి. ఇందుకు కనీసం రూ.200 కోట్లు అవసరం.

- నాగావళిపై నిర్మించిన తోటపల్లి ఉమ్మడి జిల్లాకు వరప్రదాయిని. 2.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పటివరకూ 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 64 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. 34 డిస్ర్టిబ్యూషన్‌ కాలువలకు 26 పూర్తయ్యాయి. మరో 8 నిర్మించాల్సి ఉంది. మిగిలిన పనులకు రూ.123.21 కోట్లు అవసరం. గత వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.47.80 కోట్లు మంజూరు చేసింది. కనీసం రూ.200 కోట్లు అవసరం.

- గజపతినగరం బ్రాంచ్‌ కెనల్‌ కూడా నిధుల కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటివరకూ కేవలం 44 శాతం పనులు మాత్రమే జరిగాయి.

- వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.63.50 కోట్లతో పాలనా ఆమోదం లభించింది. ఐదేళ్లలో 22 శాతం మాత్రమే పనులు జరిగాయి. రూ.8.29 కోట్ల బకాయి ఉంది.

గాడిన పడని పారిశ్రామిక రంగం

జనపనార, ఫెర్రో అల్లాయూస్‌, చక్కెర పరిశ్రమలు ఉపాధి వనరులు. మొన్నటివరకూ జిల్లా ప్రజల్లో వెలుగులునింపాయి. వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని సంక్షోభంలో పడ్డాయి. తొలుత జనపనార పరిశ్రమలు, తరువాత చక్కెర కర్మాగారాలు, అటు తరువాత ఫెర్రో అల్లాయూస్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది కార్మిక కుటుంబాలు వీధినపడ్డాయి. పరోక్షంగా అంతుకు మించి కుటుంబాలు నష్టపోయాయి. జిల్లాలో గోగు 1.08 లక్షల ఎకరాల వరకూ సాగయ్యేది. పుష్కరకాలం కిందట 30 వేల ఎకరాలకు పడిపోయింది. ఇప్పుడు పూర్తిగా పంట కనుమరుగైంది. ఉమ్మడి జిల్లాలోని బొబ్బిలి, రాజాం, సాలూరు ప్రాంతాల్లో 20 వరకూ జూట్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. ఫెర్రో పరిశ్రమలదీ అదే తీరు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 ఉండేవి. అందులో సగం మూతపడ్డాయి. జిల్లాలో రెండు చక్కెర పరిశ్రమలు సహకార రంగంలో నడిచేవి. సీతానగరం ఎన్‌సీసీ ప్రైవేటుపరం అయ్యింది. వాటి ఆస్తుల విక్రయం జరిగిపోయింది. పూర్తిగా పరిశ్రమ మూతపడింది. భీమసింగి కర్మాగారం ఆధునీకరణ పేరుతో నిలిపివేసి ఏళ్లు గడుస్తోంది. వీటిలో పనిచేసే 12 వేల మంది కార్మికులు వీధినపడ్డారు. చెరకు సాగు తగ్గి లక్షలాది మంది రైతులకు పంట గిట్టుబాటు కలగడం లేదు.

రహ‘దారుణాలు’

జిల్లాలో అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారులు ఉన్నాయి. వైసీపీ పాలనలో దారుణంగా తయారయ్యాయి. తగరపువలస-విజయనగరం-రాజాం రహదారి ప్రధానమైనది. గత ఐదేళ్లలో కనీస నిర్వహణ లేక దారుణంగా మారింది. దీనిని పీపీపీ పద్ధతిలో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో విజయనగరం-పార్వతీపురం, చిలకపాలెం-పార్వతీపురం రోడ్లు సైతం దారుణంగా మారాయి. వాటిని సైతం పూర్తిచేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.

గిరిజన యూనివర్సిటీకి గూడు ఏదీ?

జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం రూపుదాల్చడానికి 11 సంవత్సరాలు పట్టింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా అప్పట్లో గిరిజన యూనివర్సిటీని కేటాయించారు. తొలుత శృంగవరపుకోట నియోజకవర్గంలోని రెల్లిలో స్థల ఎంపికను పూర్తిచేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీని దత్తిరాజేరు-మెంటాడ మండలాల్లోని సరిహద్దు ప్రాంతాలకు మార్చింది. టీడీపీ ప్రభుత్వం ఎంపికచేసిన స్థలంలోనే పనులు పూర్తిచేసి ఉంటే కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుతం 519 ఎకరాల్లో పనులు ప్రారంభించారు. భవన నిర్మాణం శరవేగంగా జరిపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

ఇతర రంగాలపై దృష్టిపెట్టాలి

జిల్లాలో విద్య, వైద్యరంగాలపై దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. విద్యాపరంగా మరిన్ని వసతులు మెరుగుపడాలి. విజయనగరం కార్పొరేషన్‌ విస్తరించినా.. నగరీకరణ జరుగుతున్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. రాజాం మునిసిపాల్టీకి పాలకవర్గం లేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. బొబ్బిలి మునిసిపాల్టీది అదే పరిస్థితి. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో పదుల సంఖ్యలో మత్స్యకార గ్రామాలున్నాయి. వీటి పరిధిలో జెట్టి నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఇవన్నీ బడ్జెట్‌ కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నాయి.

Updated Date - Feb 13 , 2026 | 12:14 AM