Does Rajam have that Rajasam dream? రాజాంకు ఆ రాజసం కలేనా?
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:01 AM
Does Rajam have that Rajasam dream? c పారిశ్రామిక ప్రగతిలో జిల్లా రోజురోజుకు దిగజారుతోందని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సూచీలో తేటతెల్లమైంది. ఈ మాట విన్న జిల్లా ప్రజలకు వెంటనే గుర్తుకొచ్చిన ప్రాంతం రాజాం. పారిశ్రామిక పట్టణంగా పేరొందిన ఈ ప్రాంతంలో 20కు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో జిల్లా స్థాయిలో ఆ ప్రభావం పడింది. పారిశ్రామికంగా వెనకబడిందనే ముద్ర వేసుకుంది. ఇటు రాజాంలో మూతపడిన వాటిలో ఒక్కటీ తెరుచుకోకపోగా కొత్తగా ఒక్క పరిశ్రమా రాలేదు. దీంతో పూర్వవైభవం కలేనా అని ఈ ప్రాంతీయులు నిరాశ చెందుతున్నారు.
రాజాంకు
ఆ రాజసం కలేనా?
పారిశ్రామికంగా తిరోగమనం
20కు పైగా పరిశ్రమలు మూత
తెరిపించే చర్యలు శూన్యం
కొన్నేళ్లుగా కొత్తగా ఒక్కటీ రాని వైనం
ప్రత్యామ్నాయ ఉపాధి బాటలో వేలాది మంది కార్మికులు
పారిశ్రామిక ప్రగతిలో జిల్లా రోజురోజుకు దిగజారుతోందని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సూచీలో తేటతెల్లమైంది. ఈ మాట విన్న జిల్లా ప్రజలకు వెంటనే గుర్తుకొచ్చిన ప్రాంతం రాజాం. పారిశ్రామిక పట్టణంగా పేరొందిన ఈ ప్రాంతంలో 20కు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో జిల్లా స్థాయిలో ఆ ప్రభావం పడింది. పారిశ్రామికంగా వెనకబడిందనే ముద్ర వేసుకుంది. ఇటు రాజాంలో మూతపడిన వాటిలో ఒక్కటీ తెరుచుకోకపోగా కొత్తగా ఒక్క పరిశ్రమా రాలేదు. దీంతో పూర్వవైభవం కలేనా అని ఈ ప్రాంతీయులు నిరాశ చెందుతున్నారు.
రాజాం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి)
రాజాంలో రెండు దశాబ్దాలుగా పరిశ్రమలు మూతపడుతూ వస్తున్నాయి. కొత్త పరిశ్రమల రాక దాదాపు లేకుండా పోయింది. మూడేళ్ల కిందట ఇక్కడికి సమీపంలో కాగితపు పరిశ్రమ వచ్చినప్పటికీ మూన్నాళ్ల ముచ్చట అయిపోయింది. ప్రస్తుతం పనిచేయడం లేదు. గతంలో సరిత సింథటిక్ పరిశ్రమలో 600 మంది కార్మికులు పనిచేసేవారు. షిఫ్ట్‌కు 200 మంది చొప్పున విధుల్లో ఉండేవారు. సింథటిక్ ఉత్పత్తి ఎక్కువగా జరిగేది. అటువంటి పరిశ్రమ 2014లో ఉన్నఫలంగా మూతపడింది. కార్మికులు వీధినపడ్డారు. అలాగే వస్త్రపూరి కాలనీలో రెండు వైర్ల పరిశ్రమలుండేవి. రెండు కంపెనీల్లో దాదాపు 300 మంది కార్మికులు పనిచేసేవారు. ఇవీ మూతపడ్డాయి. రాజాంలో పాలిమర్స్ పరిశ్రమ ఉండేది. పరిసర గ్రామాలకు చెందిన 100 మంది కార్మికులు అక్కడ పనికి కుదిరారు. కొన్నాళ్ల పాటు సవ్యంగా నడిచిన తరువాత పరిశ్రమ మూతపడింది. రాజాంకు సమీపంలోని అంతకాపల్లి వద్ద ఎంతో వైభవంగా నడిచిన పోలీప్యాక్స్ పరిశ్రమ 2000కు ముందే మూతపడింది. పెనుబాక వద్ద దాదాపు 15 ఏళ్లు దిగ్విజయంగా నడిచిన సీతారామ జూట్ ఫ్యాక్టరీ 10 ఏళ్ల కిందట మూతపడింది. ప్రస్తుతం నడుస్తున్న జూట్ ఫ్యాక్టరీలు కూడా ఆశాజనకంగా లేవు. ఇప్పటికే కార్మికులను కూడా కుదించేశాయి. విద్యుత్ రాయితీలు లేకపోవడం, ముడిసరుకు ధరలు, దిగుమతి భారంగా మారడం వెరసి పరిశ్రమల నిర్వహణ భారం కావడంతోనే ఇవన్నీ మూతపడ్డాయి.
- రాజాంలోని జూట్, సిమెంట్, ప్లాస్టిక్, సింథటిక్, విద్యుత్ వైర్లు, పైపులు పరిశ్రమల్లో రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, శ్రీకాకుళం జిల్లా పొందూరు, జి.సిగడాం మండలాలకు చెందిన వేలాది కార్మికులు పనిచేసేవారు. కుటుంబాలకు ఉపాధి భరోసా లభించేది. కానీ ఒక్కొక్క పరిశ్రమ మూతపడుతూ వచ్చింది. ప్రస్తుతం నాలుగు జూట్ పరిశ్రమలు నడస్తున్నాయి కానీ నేడో... రేపో అన్నట్లు ఉన్నాయి. వాటిని అతి కష్టమ్మీద నడుపుతున్నారు. పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు వేలాది మంది కార్మికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిస్తున్న పరిశ్రమల మూతకు చాలా కారణాలున్నాయి. ప్రధానంగా ముడిసరుకుల కొరత వేధిస్తోంది. వాటి లభ్యత తగ్గడం, ధర పెరగడం, విద్యుత్ చార్జీలు పెరగడం, రాయితీలను నిలిపివేయడం, పరిశ్రమ నిర్వహణ ఖర్చు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడం తదితర కారణాలతో పరిశ్రమలు నష్టాల బాట పట్టాయి. ఆపై యాజమాన్యాలు లాకౌట్ ప్రకటించాయి. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు, మార్కెటింగ్ సదుపాయం కల్పించడంలో విఫలమయ్యాయి.
రైల్వే మార్గం ఎప్పుడో?
రాజాంలో దాదాపు 20 పరిశ్రమలుండగా రైల్వే లైన్ ఏర్పాటు ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ రాజాం పట్టణాన్ని కలుపుతూ ప్రత్యేక రైల్వేలైన్ ఏర్పాటుకు మోక్షం కలుగుతుందని ఆశించడం.. ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం రీవాజుగా మారింది. ఆ ప్రభావం పరిశ్రమల నిర్వాహణపై పడింది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలతో పాటు విద్యుత్ రాయితీలు అందిస్తే తెరుచుకునే అవకాశం ఉంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని రాజాం నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
గతంలో స్థానికంగానే ఉపాధి
గతంలో స్థానికంగానే ఉపాధి దొరికేది. ఊర్లో ఉంటూ స్థానిక పరిశ్రమల్లో పనిచేసేవారం. కుటుంబ జీవనం గడిచిపోయేది. వివిధ కారణాలు చూపుతూ పరిశ్రమలను యాజమాన్యాలు మూసివేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా తెరిపించే చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.
- కంచుపల్లి సీతంనాయుడు, స్థానికుడు, రాజాం
నాడు ఎన్నో పరిశ్రమలు
గతంలో రాజాం అంటే పరిశ్రమల పట్టణంగా పేరుండేది. చుట్టు పక్కల ప్రాంతాలు చూస్తే పరిశ్రమలు కనిపించేవి. ఆ కళ చెదిరిపోయింది. ఒక్కోటి మూతపడుతూ ఉండడం బాధాకరం. ప్రభుత్వాలు కనీసం వాటిని తెరిపించే ప్రయత్నం చేయకపోవడం ఆవేదన కలిగిస్తోంది.
చింతపల్లి సూరిబాబు, స్థానికుడు, రాజాం
-------------