Share News

ఓట్లప్పుడే గుర్తొస్తామా?

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:45 AM

ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. కానీ విజయనగరం నగరంలోని శివారు కాలనీల ప్రజల బతుకులు మాత్రం మారడం లేదు.

ఓట్లప్పుడే గుర్తొస్తామా?
మౌలిక వసతులకు నోచుకోని గిరిజన కాలనీ

ఏళ్లు గడుస్తున్నా శివారు కాలనీలకు అందని మౌలిక వసతులు

తాగునీరు, రహదారులు, వీధి దీపాలు లేక అవస్థలు

ఎన్నికల సమయంలో హామీలు.. ఆ తర్వాత నేతల జాడ కరువు

నేడు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం

విజయనగరం టౌన్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. కానీ విజయనగరం నగరంలోని శివారు కాలనీల ప్రజల బతుకులు మాత్రం మారడం లేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు హామీలిచ్చి వెళ్లిపోతున్నారని, ఆ తర్వాత తమ సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 57వ డివిజన్‌ కెఎల్‌పురం గిరిజన కాలనీ, అయ్యన్నపేట సెంచు కాలనీల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలకు ఇప్పటికీ కనీస మౌలిక వసతులు అందలేదు. తాగునీరు, రహదారులు, వీధి దీపాలు లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళనైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈనెల 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం సందర్భంగా శివారు కాలనీలోని దుస్థితిపై కథనం..

పద్నాలుగేళ్లయినా.. వసతులేవీ?

నగరపాలక సంస్థ పరిధిలోని 57వ డివిజన్‌ సర్వే నంబరు 137లో 35 గిరిజన కుటుంబాలకు 14 క్రితం అప్పటి కలెక్టర్‌ వీరబ్రహ్మయ్య పట్టాలు మంజూరు చేశారు. వారికి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత అధికారులు, పాలకులు ఆ కుటుంబాల సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కాలనీలో కేవలం మూడు విద్యుత్‌ స్తంభాలే ఉండటంతో రాత్రివేళ చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే వాటర్‌ ట్యాంకు వస్తుండటంతో తాగునీటికి అవస్థలు తప్పడం లేదు.

పైవ్రేటు లేఅవుట్లకు వసతులు.. వారికి మొండిచేయి

అయ్యన్నపేట సెంచు కాలనీ, కెఎల్‌పురం బీసీ కాలనీలకు వెళ్లే మార్గాల్లో పైవ్రేటు లేఅవుట్లు ఉన్నాయి. అక్కడ స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారికి విద్యుత్‌, తాగునీరు, రహదారి సౌకర్యాలు కల్పించారని స్థానికులు చెబుతున్నారు. తమ కాలనీల్లో మాత్రం కనీస వసతులు కల్పించేందుకు అధికారులు చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొండల మధ్య.. చీకట్లో బతుకులు

కాలనీల చుట్టూ కొండలు ఉండటంతో విషజంతువుల సంచారం అధికంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. వీధి దీపాలు లేక చీకటి పడితే బయటకు రావాలంటే భయపడాల్సి వస్తోందని అంటున్నారు. ఒక్కోసారి వాటర్‌ ట్యాంకు రాకపోతే తాగునీటి కోసం కిలోమీటరు దూరం వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. సరైన రహదారులు లేక వర్షాకాలంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక వసతులు కలిఁంచాలని కోరుతున్నారు.

ఎమ్మెల్యే వద్దకు పలుమార్లు వెళ్లాం

మౌలిక వసతులు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మితో పాటు అధికారులను పలుమార్లు కలిశాం. రహదారులు లేక తుప్పల మధ్యే జీవనం సాగిస్తున్నాం. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతాయని విన్నాం. కానీ మా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.

- నరవ పార్వతమ్మ, సెంచు కాలనీూూ

ఎన్నికలప్పుడే నాయకులు కనిపిస్తున్నారు

ఎన్నికల సమయంలో అన్ని పార్టీల నాయకులు మా కాలనీలకు వస్తున్నారు. సమస్యలన్నీ విని, ఎన్నో హామీలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్లకు ఎన్నికలు వచ్చినప్పుడే కనిపిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా కాలనీలో మౌలిక వసతులు మాత్రం కల్పించడం లేదు.

- మంచాల పోలమ్మ, గిరిజన కాలనీ, కెఎల్‌పురం

నాయకులపై నమ్మకం పోయింది

ఈ కాలనీలో 13 ఏళ్లుగా నివసిస్తున్నాం. మూడు ఎన్నికలను చూశాం. ప్రతిసారీ నాయకులు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వెళ్లిపోతున్నారు. పలుమార్లు అధికారులు, నాయకులను కలిసి విన్నవించినా ఫలితం లేదు. ఈసారి ఓట్లు వేయకూడదని నిర్ణయించుకున్నాం.

- రావి రత్నం, గిరిజన కాలనీ

Updated Date - Oct 17 , 2026 | 12:45 AM