Share News

Tribal village roads: ఆందోళన చేస్తేనే స్పందిస్తారా?

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:02 AM

Tribal village roads: గిరిశిఖర గ్రామాల రోడ్లను పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

Tribal village roads: ఆందోళన చేస్తేనే స్పందిస్తారా?

- గిరిశిఖర గ్రామాల రోడ్లపై అధికారుల నిర్లక్ష్యం

- సంవత్సరాలు గడుస్తున్నా ముందుకు సాగని పనులు

- కొన్ని రహదారుల నిర్మాణాల్లో నాణ్యత డొల్ల

  • ఈ రోడ్డుపై కనిపిస్తున్న అధికారులు పంచాయతీరాజ్‌ ప్రాజెక్టు డీఈఈ అప్పలనాయుడు, ఏఈఈ ఐశ్వర్య. శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీలోని దబ్బగుంట నుంచి దారపర్తి పంచాయతీ పల్లపు దుంగాడ వరకు ఉన్న ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. నాలుగున్నరేళ్ల కిందట ఈ రోడ్డును అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ, ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. దీంతో ఇటీవల మండల పరిధిలోని పలు గిరిజన గూడెంలకు చెందిన విద్యార్థులు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఫొటోను వారి మెడలో వేసుకుని రోడ్డును బాగు చేయాలని వేడుకున్నారు. ఇది వైరల్‌ కావడంతో ప్రభుత్వం దృష్టిలో పడింది. దీంతో హుటాహుటిన పంచాయతీరాజ్‌ ప్రాజెక్టు డీఈఈ, ఏఈఈ ఈ రోడ్డును పరిశీలించారు.

  • శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ శివారు చిట్టింపాడు గ్రామానికి రోడ్డు వేసేందుకు 2024 అక్టోబరు 3న ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ నుంచి రూ.11.30 కోట్లు కేటాయించారు. విశాఖ-అరకు రోడ్డు నుంచి గూనపాడు వయా మేట్లపాలెం శనగపాడు, చిట్టింపాడు వరకు 10.40కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఏడాదిన్నర అవుతున్నా ఇంకా పనులు ప్రారంభంకాలేదు.

  • శృంగవరపుకోట పంచాయతీ శివారు పుణ్యగిరి కొండ మెట్ల మార్గం వరకు ఉన్న జడ్పీ రోడ్డు నుంచి రేగపుణ్యగిరి వరకు 3.05 కిలోమీటర్ల గల రోడ్డు పనులను గతేడాది జనవరి 24న అప్పటి కలెక్టర్‌ అంబేడ్కర్‌ ప్రారంభించారు. రూ.4 కోట్లు ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న ఈ పనులు ఇంకా పూర్తి పూర్తికాలేదు.

శృంగవరపుకోట ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల రోడ్లను పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిధుల కేటాయింపుతోపాటు పరిపాలన అనుమతులు వచ్చినప్పటికీ చాలా రోడ్ల పనులు చేపట్టకపోవడం, ఒకవేళ పనులు ప్రారంభించినా పూర్తి చేయకుండా సంవత్సరాలు గడిపేయడం పరిపాటిగా మారింది. ఈ రోడ్లపై గిరిజనులు ఆందోళన లు, నిరసనలు చేపట్టడం లేదా పత్రికలు, టీవీ చానళ్లలో కథనాలు వస్తే తప్పా అధికారులు స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అప్పుడు హడావుడిగా రోడ్లను పరిశీలించడం, పనులు చేపట్టడం చేస్తున్నారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేపాడ మండలం మారిక, ఎస్‌.కోట మండలం దారపర్తి గిరిజన రోడ్లకు నిధులు తీసుకువచ్చారు. ఈ రోడ్లు ఇప్పటికీ పూర్తికాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో చిట్టింపాడుతో పాటు వేపాడ మండలం గదబవలస గిరిజన గ్రామాలకు రోడ్లు వేసేందుకు నిధులు కేటాయించారు. అయితే, ఏడాది కాలం దాటుతున్నా పనులు చేపట్టలేదు. అధికారులు కాకమ్మకబుర్లతో కాలం వెల్లబుచ్చుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా అటవీ శాఖ అనుమతులను బూచిగా చూపిస్తున్నారు. మరోపక్క కొన్ని కొండశిఖర గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లు నాణ్యతగా ఉండడం లేదు. ప్రధానంగా కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రోడ్లకు ఇరువైపులా బెర్ములు ఏర్పాటు చేయాలి. వర్షం వచ్చినప్పుడు వరద నీరు కల్వర్టుల్లోకి వెళ్లాలా చర్యలు చేపట్టాలి. కానీ, ఈ పనులేవీ చేపట్టకుండా రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో వర్షాలకు వరద నిలిచిపోయి రోడ్లు దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా ఈ రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టడంతో పాటు మిగతా రహదారుల పనులు ప్రారంభించాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 12:02 AM