Do you care about this year...! ఈ ఏడాదైనా పట్టించుకుంటారా...!
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:01 AM
Do you care about this year...! ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ సారైనా పారదర్శకంగా జరుగుతాయా? అక్రమాలకు ఆస్కారం లేకుండా నిర్వహించగలరా? అధికారులు కఠినంగా ఉంటారా? లోపాలు గుర్తిస్తే చర్యలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరితో ఒకేషనల్ విద్యను నడిపిస్తున్న కళాశాలల యాజమాన్యాలు ఎంతవరకు నిబంధనలు అనుసరిస్తాయో చూడాలి. ఇంటర్ ప్రాక్టికల్స్ మంగళవారం ప్రారంభం అవుతున్నాయి. వచ్చేనెల 5 వరకు కొనసాగనున్నాయి.
ఈ ఏడాదైనా పట్టించుకుంటారా...!
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
ఫిబ్రవరి ఆరు వరకు కొనసాగేలా షెడ్యూల్
ఒకరిద్దరితో ఒకేషనల్ విద్యను నడిపేస్తున్న యాజమాన్యాలు
అత్యధిక ప్రవేశాలు ఉండే ప్రైవేటు కళాశాలకు పరీక్ష కేంద్రం
ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ సారైనా పారదర్శకంగా జరుగుతాయా? అక్రమాలకు ఆస్కారం లేకుండా నిర్వహించగలరా? అధికారులు కఠినంగా ఉంటారా? లోపాలు గుర్తిస్తే చర్యలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరితో ఒకేషనల్ విద్యను నడిపిస్తున్న కళాశాలల యాజమాన్యాలు ఎంతవరకు నిబంధనలు అనుసరిస్తాయో చూడాలి. ఇంటర్ ప్రాక్టికల్స్ మంగళవారం ప్రారంభం అవుతున్నాయి. వచ్చేనెల 5 వరకు కొనసాగనున్నాయి.
శృంగవరపుకోట, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు డబ్బులు ఇచ్చేస్తే ఇంటర్ ప్రాక్టికల్ (ప్రయోగ) పరీక్షల్లో కూర్చోకపోయినా మార్కులు వేసేస్తారన్న అపవాదు ఉంది. వీరికి కొందరు విద్యాశాఖాధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాదైనా ఈ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తారో లేదో చూడాలి. ఈనెల 27 (మంగళవారం) నుంచి ఫిబ్రవరి 6వరకు ఇంటర్ ప్రాక్టికల్ నిర్వహించేలా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఇంటర్ ఒకేషనల్ విద్యను మాత్రమే నడుపుతున్న ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు మంగళవారం నుంచి, సాధారణ గ్రూపులతో పాటు ఒకేషనల్ గ్రూపులు ఉన్న కళాశాలలకు ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ జరగనున్నాయి. ఒకరిద్దరితో కొన్ని ఒకేషనల్ ప్రైవేటు కళాశాలలు నడుస్తున్నాయి. సాధారణ ఇంటర్ విద్యను నడుపుతున్న కళాశాలల్లోనూ ఒకటి నుంచి ఐదులోపు విద్యార్థులు చదువుతున్న దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి వారందరికీ అత్యధిక అడ్మిషన్‌లు ఉండే ఒకేషనల్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి నుంచి పదిలోపు మంది విద్యార్థులున్న కళాశాలలో చదవుతున్న విద్యార్థులకు ఏమేరకు బోధన అందుతుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రైవేటు ఒకేషనల్ కళాశాలల్లో ఒకేషనల్ విద్యను అభ్యసించేందుకు చేరిన విద్యార్థుల సంఖ్య ఎక్కువ వున్నప్పటికీ ప్రాక్టికల్స్‌కు అవసరమైన లాబ్‌లు లేనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కళాశాలలు చాలా వరకు అద్దె భవనాల్లోని పై అంతస్థుల్లో నిర్వహిస్తున్నాయి. వీటిని చూసేవారెవరైనా కళాశాలలుగా భావించరు. ఇలాంటి కళాశాలల్లో కూడా వృత్తివిద్యాశాఖా ధికారులు పరీక్ష కేంద్రం మంజూరు చేశారు. ఇవన్నీ ప్రాక్టికల్ పరీక్షల పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.
అక్రమాలకు ఓ ఉదాహరణ
గత ఏడాది శృంగవరపుకోట పట్టణంలోని ఓ ప్రైవేటు ఒకేషనల్ కళాశాలలో జరిగిన ప్రాక్టికల్ పరీక్షలను చూసేందుకు జిల్లా విద్యాశాఖాధికారొకరు వచ్చారు. వేరే కళాశాల ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రంలో ఉండాల్సిన ఇన్విజిలేటర్ ఇక్కడ కనిపించారు. ‘నువ్వేంటి ఇక్కడున్నావని’ అధికారి అడిగారు. ఇన్విజిలేటర్ ఓ చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదేమంత పెద్ద విషయం కాదనుకున్నారో, తమ వంతుగా సహకారమందించారో తెలియదుకాని పరీక్ష మాత్రం సాఫీగా జరిగిపోయింది.
ఎన్నెన్నో ఆరోపణలు
ఈ ఏడాది జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణకు 34 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు 16 కేంద్రాల్లో ఇంటర్ ఒకేషనల్ విద్యార్ధులకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ఇంటర్‌తో పాటు ఒకేషనల్ విద్యను అభ్యసిస్తున్న కళాశాలలకు చెందిన విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలను పలు కళాశాల యాజమాన్యాలు తూతూ మంత్రంగా చూస్తున్నాయి. పాఠ్యాంశానికి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్లు భోగట్టా. ఇలా వసూలు చేసిన డబ్బులతో ఇన్విజిలేటర్, డిపార్ట్‌మెంటల్ అధికారి, ఇతర పరీక్షల అధికారులను లోబర్చుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు పనులు చేసేందుకు సిద్ధపడుతున్న ఆయా ప్రైవేటు కళాశాలలు ముందుగానే తమకు అనుకూలమైన ఇన్విజిలేటర్‌లతో పాటు ఇతర పరీక్షల అధికారులను నియమించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రాక్టికల్స్ జరిగే కేంద్రాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టినప్పుడే ప్రైవేటు కళాశాలల తప్పుడు మార్గాలకు అడ్డుకట్టపడుతుంది.
---------