Share News

Do not ruin lives. జీవితాలను నాశనం చేసుకోవద్దు

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:06 AM

Do not ruin lives.

Do not ruin lives. జీవితాలను నాశనం చేసుకోవద్దు
వేదికపై మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి అనిత

జీవితాలను నాశనం చేసుకోవద్దు

మత్తుకు యువత బానిస కావొద్దు

ఉత్తరాంధ్రలో ఊహించని అభివృద్ధి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత

నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు ఉపాధి: మంత్రి శ్రీనివాస్‌

విజయనగరం, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): యువత క్షణికావేశానికి లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దని, మత్తుకు బానిసైతే భవిష్యత్తు శూన్యమవుతుందని హోంశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో సోమవారం నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం.. సంక్షేమం అభివృద్ధి’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈగల్‌ నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తప్పించుకోలేరని చెప్పారు. గంజాయి కేసుల్లో దొరికిన వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లలో జిల్లాను రూ.1200 కోట్లతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. భవిష్యత్‌ అంతా యువతదేనని, గతంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా పిలిచారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వెనకుండి నడిపించే జిల్లాలుగా మారాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, గూగుల్‌ డేటా సెంటర్‌, అనకాపల్లిలో స్టీల్‌ ప్లాంట్‌ లాంటి భారీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందన్నారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అవ్వాతాతలకు ప్రభుత్వం భరోసా కల్పించిందన్నారు. త్వరలో ప్రధాని మోదీ చేతులమీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుందని హోంమంత్రి తెలిపారు.

సంక్షేమం.. అభివృద్ధి సమాంతరంగా

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా సాగాయని ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మంత్రి నారా లోకేష్‌ కృషితో రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి భారీగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటా ఒక పారిశ్రామిక వేత్తను చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎంస్‌ఎంఈ పార్కుల పనులు ప్రారంభమయ్యాయన్నారు.

- కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో విశేష ప్రగతిని సాధించిందన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌ , ఉచిత బస్సు ప్రయాణం, వైద్యసేవలు, గృహనిర్మాణం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఉపాది కల్పన వంటి అనేక పథకాల ద్వారా జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొందారన్నారు.

- ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈగల్‌ వింగ్‌, ఆపరేషన్‌ గరుడ, ఆపరేషన్‌ గంజాయ్‌ తదితర కార్యక్రమాలతో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా పెంచామన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న వారంతా డ్రగ్స్‌ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు.

ఆకట్టుకున్న స్టాళ్లు

వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిపై ఏర్పాటు చేసిన 20 స్టాళ్లను మంత్రులు సందర్శించారు. డ్రగ్స్‌ నియంత్రణపై కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. నార్కోటెక్‌ శునకం రుద్ర గంజాయిని ఎలా గుర్తిస్తుందో చూపించారు. కార్యక్రమంలో జోనల్‌ ఇన్‌చార్జి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్యేలు కళావెంకటరావు, కోండ్రుమురళీమోహన్‌, కోళ్ల లలితకుమారి, పూసపాటి అదితి గజపతిరాజు, బేబీనాయన, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌ వర్మ, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మున్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అప్పు ఇచ్చే స్థాయికి చేరుకున్నా

చింతాడ భవాని, లబ్ధిదారు, ఎస్‌.కోట

ప్రభుత్వ పథకాలు మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మార్చేశాయి. అన్నదాతసుఖీభవ ద్వారా ఏడాదికి రూ.20 వేల సాయం, వృద్ధులకు ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛను రూ.4వేలు, దీపం పథకం ద్వారా ఉచిత వంటగ్యాస్‌ పొందుతున్నాం. డ్వాక్రా ద్వారా తీసుకున్న రుణంతో పాల డైరీని ఏర్పాటు చేసి నడుపుతున్నాను. 27 ఏళ్లుగా డ్వాక్రా సంఘంలో ఉన్న నేను ఏటా రూ.5లక్షలు సంపాదిస్తూ అప్పు ఇచ్చే స్థాయికి ఎదిగాను.

ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇచ్చింది

జి.హేమలత, బోనంగి, గంట్యాడ మండలం

ప్రభుత్వ పథకాలతో నా కుటుంభానికి అన్ని విధాలా ఆర్థిక భరోసా లభించింది. అన్నదాత సుఖీభవతో ఏటా రూ.20 వేలు అందుతోంది. స్త్రీనిధి పథకం నిధులతో లక్షరుణం తీసుకుని పాడి ఆవులను కొన్నాను. నెలకు సుమారు రూ.10వేల ఆదాయం వస్తోంది. వీటితో పాటు ఉచిత గ్యాస్‌, స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం లభిస్తోంది.

మా జీవితాలను మార్చారు

కె.వెంకటగోపాల్‌, జామి

గంజాయి బారిన పడిన మా కుటుంబాన్ని పోలీసులే మార్చారు. మా బావ గంజాయి వ్యసనానికి బానిస కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంది. దీన్ని గుర్తించి జిల్లా పోలీస్‌ విభాగం బావకు ప్రత్యేక కౌన్సిలింగ్‌ ఇచ్చారు. దీంతో పూర్తిగా మారి సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. పిల్లలు చక్కగా చదువుతున్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుతున్న పోలీసు శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు.

Updated Date - Jun 16 , 2026 | 12:06 AM