Share News

ఆలయాన్ని తొలగించవద్దు

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:41 AM

స్థానిక రైల్వేస్టేషన్‌ పరిధిలోని మల్లమ్మపేటలో అభయాంజనేయ ఆలయాన్ని తొలగించాలన్న యోచన విరమించుకోవాలని గ్రామపెద్దలు రైల్వే అధికారులకు మరోసారి స్పష్టం చేశారు.

ఆలయాన్ని తొలగించవద్దు
రైల్వే అధికారులను కలిసిన మల్లమ్మపేట గ్రామపెద్దలు

బొబ్బిలి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వేస్టేషన్‌ పరిధిలోని మల్లమ్మపేటలో అభయాంజనేయ ఆలయాన్ని తొలగించాలన్న యోచన విరమించుకోవాలని గ్రామపెద్దలు రైల్వే అధికారులకు మరోసారి స్పష్టం చేశారు. గ్రామపెద్దలు శనివారం స్థానిక రైల్వే పీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ అధికారులను కలిసి తమ నిర్ణయాన్ని తెలిపారు. రైల్వేస్టేషన్‌ విస్తరణలో భాగంగా ఈ ఆలయాన్ని తొలగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకు స్థానికులతో పాటు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. రైల్వే భూభాగంలోని ఆలయాన్ని తొలగించక తప్పదని, ఇంకెక్కడైనా ఆలయాన్ని నిర్మించుకుంటే సహకారం అందిస్తామనే ప్రతిపాదనను గ్రామపెద్దలు అంగీకరించలేదు. ఈ ఆలయాన్ని తొలగిస్తే గ్రామానికి అరిష్టం జరుగుతుందని అధికారులకు వివరించారు. గ్రామస్థుల వాదనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు బదులిచ్చారు. రైల్వే అధికారులను కలిసిన వారిలో గ్రామపెద్దలు పెద వెంకటరమణ, ఆలయ ధర్మకర్త తెంటు ప్రసాద్‌, తెంటు సీతారామ్మూర్తి, పోల జనార్దన్‌, పోల పెదకృష్ణ, మాజీ కౌన్సిలర్లు తెంటు పార్వతి, ఇంటి గోవిందరావు, పోల వసంత్‌, శంకర్‌, రమేశ్‌ తదితరులున్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:41 AM