Do Not Register సాలూరులో ఆ భూములకు రిజిస్ర్టేషన్లు చేపట్టొద్దు!
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:36 PM
Do Not Register Those Lands in Salur! సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్‌లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై బుధవారం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
పార్వతీపురం, జూన్3(ఆంధ్రజ్యోతి): సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్‌లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై బుధవారం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సాలూరులో డగ్లస్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన భూములకు సంబంధించి ఇకపై రిజిస్ర్టేషన్లు, మ్యుటేషన్లు, ఉప విభజనలు చేపట్టరాదని ఆదేశించారు. సర్వే నెంబర్ 175/1లో 3.14 ఎకరాల భూమిని వెబ్‌ల్యాండ్ డిస్ప్యూట్ రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు.
నెలాఖరులోగా జలధార పనులు పూర్తికావాలి
జిల్లాలో చేపడుతున్న జలధార పనులన్నింటినీ ఈ నెలాఖరు నాటికి కచ్చితంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. పనుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ నిర్మాణాలతో పాటు వాటి పురోగతి తదితర అంశాలపై ఆరా తీశారు. జలధార పనులన్నీ వంద రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటికే 60 రోజులు గడువు ముగిసిందని గుర్తు చేశారు. ఇంకా ప్రారంభంకాని పనులన్నింటినీ తక్షణమే ప్రారంభించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం పనికిరాదన్నారు. మంజూరైన పనులన్నీ శతశాతం పూర్తి కావాలని ఆదేశించారు. అధికారులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు.