Share News

Do Not Refer Anyone ఎవరినీ రెఫర్‌ చేయొద్దు

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:40 PM

Do Not Refer Anyone సాలూరు ఏరియా ఆసుపత్రి నుంచి ఎవర్నీ రెఫర్‌ చేయరాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించి భరోసా కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం వంద పడకల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు.

Do Not Refer Anyone ఎవరినీ రెఫర్‌ చేయొద్దు
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

  • మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు

  • సాలూరులో వంద పడకల ఆసుపత్రి భవనం ప్రారంభం

సాలూరు, మార్చి20(ఆంధ్రజ్యోతి): సాలూరు ఏరియా ఆసుపత్రి నుంచి ఎవర్నీ రెఫర్‌ చేయరాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించి భరోసా కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం వంద పడకల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పట్టణంలో 30 పడకల సీహెచ్‌సీ భవనాన్ని వంద పడకల ఆసుపత్రిగా చూడాలన్న 20 ఏళ్ల కల నేటితో నెరవేరింది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఓ గర్భిణి ప్రసవం కోసం ఈ ఆసుపత్రికి వచ్చింది. బిడ్డ అడ్డం తిరిగింది.. ఇక్కడ డెలివరీ అవ్వదు.. విజయనగరం వెళ్లిపో? అని వైద్య సిబ్బంది చెప్పినా ఆమె వినలేదు.. చివరికి ఇక్కడే ప్రసవించి మృత్యువాతపడడం నేను చూశా. ఆరోజే నిర్ణయించుకున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టణానికి వంద పడకల ఏరియా ఆసుపత్రి తీసుకురావాలని, అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి తేవాలని..! మొత్తంగా ఇన్నాళ్లు చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ వందపడకల ఆసుపత్రి భవన నిర్మాణం. 2019లో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో వంద పడకల ఆసుపత్రి భవనానికి రూ.17 కోట్లతో భూమిపూజ చేశాం. అయితే మంత్రిగా ఇప్పుడు ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.కోటి అదనంగా ఖర్చు అయినా.. నిధుల మంజూరు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతగానో సహకరించారు. నియోజకవర్గ పరిధిలోని గిరిజనులతో పాటు సరిహద్దులో ఉన్న ఒడిశా వారికి కూడా ఈ ఆసుపత్రి ఒక వరంగా మారనుంది. సబ్‌ సెంటర్ల నిర్మాణానికి రూ.12 కోట్ల మంజూరయ్యాయి. త్వరలోనే ఆ పనులు చేపడతాం. ఏరియా ఆసుపత్రికి బ్లడ్‌బ్యాంకు కూడా మంజూరైంది. ముఖ్యమంత్రి సహాయనిధి కింద సాలూరు నియోజకవర్గానికి రూ.2 కోట్లు వచ్చాయి. సుమారు రూ.450 కోట్లతో వంద రోజుల్లో వంద రోడ్ల నిర్మాణంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.’ అని తెలిపారు. అనంతరం మున్సిపల్‌ ప్రత్యేకాధికారి , జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తే.. ప్రజలు సంచి వైద్యులను ఆశ్రయించి ఇబ్బందుల పాలవ్వరని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు, డాక్టర్‌ మీనాక్షి, ఏఎంసీ చైర్మన్‌ ముఖి సూర్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు, నాయకులు గుళ్ల వేణుగోపాలనాయుడు, యుగంధర్‌, పరమేశు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 11:40 PM