Share News

భూరీసర్వేలో నిర్లక్ష్యం చేయొద్దు

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:11 AM

గ్రామాల్లో చేపడుతున్న భూముల రీసర్వేలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా సర్వే అధికారి ఎం.శ్రీనివాస్‌ సిబ్బందికి సూచించారు.

 భూరీసర్వేలో నిర్లక్ష్యం చేయొద్దు
గొట్టివలసలో సిబ్బందికి సూచనలిస్తున్న సర్వే అధికారి శ్రీనివాస్‌

-- జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్‌

గరుగుబిల్లి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో చేపడుతున్న భూముల రీసర్వేలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా సర్వే అధికారి ఎం.శ్రీనివాస్‌ సిబ్బందికి సూచించారు. మండలంలోని గొట్టివలస, కొత్తపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రీసర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్వే విధి విధానాలపై తప్పనిసరిగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు కూడా సర్వే సిబ్బందికి సహకరించి భూ హద్దులను తెలియపర్చాలన్నారు. సర్వే నిర్వహణకు ముందుగానే గ్రామాల్లో అవగాహన ర్యాలీలతో పాటు గ్రామసభలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రీసర్వేను డిజిటల్‌ టెక్నాలజీతో అనుసంధానం చేసినట్లు తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా రోవర్స్‌తో భూహద్దులను జియో కోఆర్డినేట్‌ తీసుకుని కొలతలు నిర్ధారణ జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగా రైతులకు ఇకపై భూ సమస్యలు ఉండవని అన్నారు. రైతులు, సిబ్బంది పరస్పరం సహకరించుకోవాలన్నారు. సాగు హక్కు పత్రాలను రైతులు విధిగా సర్వే సమయంలో సిబ్బందికి చూపించాలన్నారు. తప్పిదాలకు ఆస్కారం లేకుండా సర్వే నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్‌ ఎం.వెంకటరమణ, గ్రామ సర్వేయర్‌ జి.వెంకటేష్‌, వీఆర్వో కె.రాఘవరావు, బుచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 12:11 AM