DJ Thunder!డీజే దడ!
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:57 PM
DJ Thunder! వినాయక నవరాత్రులు సమీపిస్తున్నాయి. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో డీజీలకు పోటాపోటీగా ఆర్డర్లు ఇస్తున్నారు. పెద్ద శబ్ధం ఉండే వాటికి మరింత డిమాండ్ పలుకుతోంది. ఈ పరిణామాన్ని గమనిస్తూ దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు భయపడుతున్నారు.
డీజే దడ!
భయపడుతున్న దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు
చవితి వేడుకలకు పెరిగినఆర్డర్లు
పోటీపడుతున్న వైనం
ఫిర్యాదులొస్తే చర్యలుంటాయన్న పోలీసులు
-- గత ఏడాది సెప్టెంబరులో విజయనగరంలోని బొబ్బాదిపేటకు చెందిన హరీష్ అనే యువకుడు వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేల వద్ద డ్యాన్స్ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు.
- రెండేళ్ల కిందట రాజాం మునిసిపాల్టీ పరిధిలోని పొనుగూటివలసలో వినాయక నిమజ్జనోత్సవంలో డీజే ఏర్పాటుచేశారు. ఓ యువకుడు డీజే వద్ద డ్యాన్స్ వేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.
రాజాం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రులు సమీపిస్తున్నాయి. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో డీజీలకు పోటాపోటీగా ఆర్డర్లు ఇస్తున్నారు. పెద్ద శబ్ధం ఉండే వాటికి మరింత డిమాండ్ పలుకుతోంది. ఈ పరిణామాన్ని గమనిస్తూ దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు భయపడుతున్నారు. ఇటు పోలీసులు కూడా డీజేలు వాడొద్దని సూచిస్తున్నారు. అనుమతి లేదని తేల్చిచెబుతున్నారు. కానీ వినాయక ఉత్సవ నిర్వాహకులు తగ్గడం లేదు. ఏటా డీజేల మోత మోగుతూనే ఉంది. ఈ ఏడాది నుంచైనా కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. వేడుకల పేరుతో, భక్తిమాటున ఏర్పాటుచేస్తున్న డీజేలతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. సంబరాల్లో ఇంటి ముందుకు డీజే వస్తోందంటే ఇళ్లలోని తలుపులన్నీ మూసి దూరంగా వెళ్తుంటారు. పసి పిల్లలను కూడా దగ్గరకు వెళ్లనివ్వరు.
అతి శబ్ధం ప్రమాదకరం
సాధారణంగా మన చెవులు 120 నుంచి 130 డెసిబుల్స్ మాత్రమే భరించగలవు. అంతకు మించితే ప్రమాదమే. మనం వింటున్న శబ్ధం తీవ్రత పెరిగే కొద్దీ రుగ్మతలు ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 60 డెసిబుల్స్‌లోపు శబ్ధం వింటే ఎటువంటి ఇబ్బందులుండవు. 100 డెసిబుల్స్ శబ్ధం దాటితే గుండె జబ్బులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 110 డెసిబుల్స్ శబ్ధం దాటితే చికాకుతో పాటు విపరీతమైన కోపం, తలనొప్పి వస్తుంది. 120 డెసిబుల్స్ శబ్ధం దాటితే చిరాకు, చర్మంపై రోమాలు నిక్కపొడుచుకోవడం, విపరీతమైన తలబాధ వస్తుంది. 160 డెసిబుల్స్ దాటితే చెవుల్లో వినికిడి కణాలపై ప్రభావం చూపుతాయి. నరాలు దెబ్బతిని పాక్షిక వైకల్యం కలుగుతుంది. 190 డెసిబుల్స్ శబ్ధం దాటితే కర్ణభేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. పూర్వపు స్థితి రావడం చాలా కష్టం.
రసాయనాల నీటితో స్పింక్లర్లు కూడా..
జిల్లాలో డీజేలను రకరకాల రీతిలో తీర్చిదిద్దుతున్నారు. చివరకు డ్యాన్స్ వేసే యువత నీటి పాటల కోసం ఏకంగా స్పింక్లర్లు ఏర్పాటుచేస్తున్నారు. వాటిలో రసాయనాలతో కూడిన రంగు నీటిని కలుపుతున్నారు. ఇది కంటిలో పడితే ప్రమాదమే. కానీ డీజేల నిర్వాహకులు కానీ.. శుభకార్యాల ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. డీజే బాక్సుల నుంచి వచ్చే వైబ్రేషన్ చాలా ప్రమాదకరం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవారిపై విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. ఆ వైబ్రేషన్‌తో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు మూసుకుపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువంటున్నారు. గర్భిణీలకు సైతం డీజే వైబ్రేషన్స్ ప్రమాదమే. అటువంటి ప్రమాదకరమైన డీజేలను నిషేధించాలన్న డిమాండ్ చాలా మంది నుంచి వినిపిస్తోంది.
చర్యలు తప్పవు
వినాయక నవరాత్రులకు తప్పనిసరిగా అనుమతులు పొందాలి. వేడుకల్లో డీజేల వినియోగం నిషేధం. వివాహాలు, శుభకార్యాల్లో డీజేల శబ్ధంతో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. డీజేలపై ఫిర్యాదు వస్తే తప్పకుండా కేసులు నమోదుచేస్తాం.
డి.నవీణ్‌కుమార్, సీఐ, రాజాం
అనర్థాలు అధికం
శబ్ధ కాలుష్యం ఇప్పటికే పెరుగుతోంది. మరోవైపు వాయు కాలుష్యంతో ప్రజలు రుగ్మతల బారిన పడుతున్నారు. ఎక్కువ డెసిబుల్ శబ్ధం కలిగించే డీజేల శబ్దాలు, సైలెన్సర్లతో అనర్థాలు అధికం. వినికిడి లోపంతో పాటు మానసిక వ్యాధులు కలుగుతాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ శబ్ధం వింటే పెను ప్రభావం చూపుతుంది. అందుకే దూరంగా ఉండాలి.
గార రవిప్రసాద్, వైద్యుడు, రాజాం
-----------------