Disturbed కలవరం
ABN , Publish Date - May 13 , 2026 | 12:21 AM
Disturbed జూట్ పరిశ్రమకు పెట్టింది పేరుగా ఉండే రాజాంలో ఆ పరిశ్రమలు పూర్తి తిరోగమనంలో పడ్డాయి. పూర్తిగా మూతపడే దిశగా పరిణామాలు జరుగుతున్నాయి. కార్మికులు ఆందోళనలో ఉన్నారు.
కలవరం
జూట్ పరిశ్రమకు ముప్పు
రాజాంలో మరో ఫ్యాక్టరీ మూత
వీధిన పడిన 600 మంది కార్మికులు
మిగతా ఐదు మిల్లులదీ అదే పరిస్థితి
శని, ఆదివారాల్లో మూత
లేఆఫ్ సంకేతాలతో కార్మికుల్లో ఆందోళన
రాజాం, మే 12 (ఆంధ్రజ్యోతి):
జూట్ పరిశ్రమకు పెట్టింది పేరుగా ఉండే రాజాంలో ఆ పరిశ్రమలు పూర్తి తిరోగమనంలో పడ్డాయి. పూర్తిగా మూతపడే దిశగా పరిణామాలు జరుగుతున్నాయి. కార్మికులు ఆందోళనలో ఉన్నారు. రాజాంలోని లక్ష్మీ శ్రీనివాస జూట్‌మిల్లు నెల రోజుల కిందట మూతపడింది. ఈ పరిశ్రమపై ఆధారపడిన 600 మంది కార్మికులు వీధినపడ్డారు. కనీసం లేఆఫ్ ప్రకటించకుండా.. కార్మికులకు కనీస సమాచారం ఇవ్వకుండా పరిశ్రమను యాజమాన్యం మూసేసింది. ఆ కార్మికులు కుటుంబాలతో రోడ్డున పడ్డారు. ప్రత్యామ్నాయ ఉపాధి లేక ఇబ్బందిపడుతున్నారు. రాజాంలో ఇక మిగిలినవి కేవలం 5 జూట్ పరిశ్రమలే. వాటికి కూడా ప్రతి శని, ఆదివారాల్లో సెలవులు ఇస్తున్నారు. వేతనాల్లో కోత విధిస్తున్నారు. కనీసం సగం వేతనాలు కూడా ఇవ్వడం లేదు. పరిశ్రమల మూసివేతకు ఇవి సంకేతాలని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఉపాధి లేక..
జిల్లాలో నీలం జూట్ పరిశ్రమతో పాటు రాజాంలోని లక్ష్మీ జూట్‌మిల్లు, కేశవ జూట్‌మిల్లు, జేడీపీ మిల్, ఎస్‌ఎస్‌ఎస్‌ఎల్, లక్ష్మీ శ్రీనివాస్ మిల్లు, రేగిడి మండలంలోని రెడ్డిపేట జీడీఎల్ జూట్ మిల్లు మాత్రమే నడుస్తూ వచ్చాయి. ఇప్పుడు లక్ష్మీ శ్రీనివాస మిల్లు మూతపడింది. మిగతా వాటిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజాం పరిశ్రమల్లో 15 వేల మంది కార్మికులు పనిచేశారు. ఒక్కో పరిశ్రమ మూతపడుతుండడంతో వారు వీధినపడుతున్నారు. కొందరు స్థానికంగా వేరే ఉపాధి మార్గాల వైపు వెళ్లారు. మరికొందరు ఇతర ప్రత్యామ్నాయాల వైపు వెళ్లిపోయారు. జూట్ మిల్లులు మూతపడడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా కారణం. మరోవైపు ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవడం, రాష్ట్ర ప్రభుత్వపరంగా రాయితీలు లేకపోవడం కూడా కారణంగా ఉంది.
తగ్గిన గోగునార విస్తీర్ణం..
జిల్లాలో గోగునార విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. వ్యయప్రయాసలతో కూడిన సాగు కావడంతో రైతులు ఆసక్తిచూపడం లేదు. దీంతో పరిశ్రమల నిర్వహణకు పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బీహార్, బంగ్లాదేశ్ నుంచి గోగును తెస్తున్నారు. గతంలో స్థానిక రైతులు గోగును సాగుచేసి నారను ఉత్పత్తి చేసేవారు. పరిశ్రమల నిర్వహణకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అయితే రైతులకు గోగుసాగు గిట్టుబాటు కావడం లేదు. విత్తనాలు సేకరించిన నాటి నుంచి గోగునారను ఊరవేయడం, నార తీయ్యడం వంటి పనులు కష్టమైపోయాయి. క్వింటా గోగు రూ.13 వేల వరకూ పలుకుతున్నా.. కష్టం ఎక్కువగా ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. రైతులు పండించిన గోగును కొనుగోలు చేయడానికి జూట్ కార్పొరేషన్ వారు ముందుకొచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పట్లో నియమించిన సిబ్బంది మొత్తం పదవీ విరమణ చేశారు. కొత్త వారి నియామకాలు జరగలేదు. కాగా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల్లో అవగాహన, సాగు సలహాలు అందించేవారు. ఇప్పడు అవీ లేవు. దీంతో రైతులు పూర్తిగా సాగు తగ్గించేశారు.
ఫ ప్రభుత్వం ప్లాస్టిక్ వస్తువలను నిషేధించింది. జూట్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచిస్తోంది. అదే మంచిదని నిపుణులు సైతం చెబుతున్నారు. ఇటువంటి సమయంలో జూట్ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తే మాత్రం జూట్ మిల్లులు తెరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు కల్పిస్తే మంచి రోజులు రావొచ్చు. లేకపోతే మాత్రం కష్టం.
ప్రభుత్వాల విధానాలతోనే..
ప్రభుత్వాల విధానాలతో జూట్ పరిశ్రమలు మూతపడుతున్నాయి. వాటిని తెరిపించే ప్రయత్నం చేయడం లేదు. ఫలితంగా వేలాది మంది కార్మికులు వీధిన పడుతున్నారు. ఇప్పటికైనా రాయితీలు అందించాలి. మద్దతు ధర కల్పించాలి. అప్పుడే జూట్ మిల్లులు తెరుచుకుంటాయి.
- సీహెచ్ రామ్మూర్తినాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి