ఫిన్లాండ్‌కు జిల్లా ఉపాధ్యాయులు
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:35 PM
ఫిన్లాండ్ దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానాన్ని పరిశీలించేందుకు జిల్లా ఉపాధ్యాయులు వెళ్లనున్నారు.
-పరిశీలించనున్న ఆ దేశ విద్యా విధానం
- పది రోజుల పాటు అంతర్జాతీయ శిక్షణ
జియ్యమ్మవలస, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఫిన్లాండ్ దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానాన్ని పరిశీలించేందుకు జిల్లా ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. గతేడాది సెప్టెంబరు 25న ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న 29 మంది ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీన్ అన్సారీ సారథ్యంలో ఫిన్లాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. వీరిలో జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి ఎంపీ ప్రాథమిక పాఠశాల (బీసీ) ప్రధానోపాధ్యాయుడు యర్రా శంకరరావు, పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సంస్కృత అధ్యాపకుడు బౌరోతు శంకరరావు ఉన్నారు. వీరు ఈ నెల 16 నుంచి 26 వరకు ఫిన్లాండ్ దేశంలో తుర్కు యూనివర్సిటీలో అంతర్జాతీయ శిక్షణ పొందనున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యలో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు, సమగ్ర అభివృద్ధి, సమస్య పరిష్కారం, క్రిటికల్ థింకింగ్, లైఫ్ స్కిల్స్, ఎర్లి చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)పై ఫిన్లాండ్ ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యాధునిక విద్యా విధానంపై పరిశోధన చేయనున్నారు. అనంతరం పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ వీరికి రిలీవింగ్ ఉత్తర్వులు ఇచ్చి అభినందించారు. శిక్షణ అనంతరం జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణలో నేర్చుకున్న బోధనా పద్ధతులు తెలియజేసి ప్రగతి పథంలో నడిపించాలని ఆదేశించారు. డీఈవోతో పాటు మండల విద్యాశాఖాధికారులు అభినందనలు తెలియజేశారు.