Sanitation System in Shambles జిల్లాకేంద్రం.. పడకేసిన పారిశుధ్యం
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:24 AM
District Headquarters: Sanitation System in Shambles జిల్లాకేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. రోజురోజుకూ ఈ సమస్య తీవ్రమవుతోంది. ఎక్కడికక్కడే చెత్తాచెదారం, కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయినా.. పట్టించుకునే వారే కరువయ్యారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను పెంచడం లేదు. దీంతో పార్వతీపురం మున్సిపాల్టీలో పారిశుధ్య నిర్వహణ జటిల మవుతోంది.
పారిశుధ్య నిర్వహణపై కొరవడిన శ్రద్ధ
జనాభా, వార్డులకు అనుగుణంగా పెరగని పారిశుధ్య కార్మికుల సంఖ్య
స్పందించకుంటే.. భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు
మున్సిపల్ నూతన పాలకవర్గంపైనే ఆశలు
పార్వతీపురం టౌన్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. రోజురోజుకూ ఈ సమస్య తీవ్రమవుతోంది. ఎక్కడికక్కడే చెత్తాచెదారం, కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయినా.. పట్టించుకునే వారే కరువయ్యారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను పెంచడం లేదు. దీంతో పార్వతీపురం మున్సిపాల్టీలో పారిశుధ్య నిర్వహణ జటిల మవుతోంది. పట్టణ జనాభా, వార్డుల పెరుగుదలతో పాటు భవిష్యత్‌లో ఏర్పడే పారిశుధ్య నిర్వహణ సమస్యలను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా ‘పుర’ వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
మున్సిపాల్టీ ఏర్పడి సుమారు 65 ఏళ్లు అవుతుంది. అప్పట్లో పట్టణంలోని 12 వార్డుల్లో 22వేల మంది జనాభాకు తగ్గట్టుగా శాశ్వత ప్రాతిపదికన 55 మంది పారిశుధ్య కార్మికులను నియ మించారు. కొన్నేళ్ల తరువాత మరో 50 మందిని నియమించారు. కాగా ఈ 15 ఏళ్లలో సుమారు 40 నుంచి 50 మంది వరకు శాశ్వత పారిశుధ్య కార్మికులు పదవీ విరమణ పొందారు. కొంతమంది మృతి చెందారు. మరోవైపు కారుణ్య నియామకాల్లో జాప్యం నెలకొంది. ఈ క్రమంలో 2002లో గ్రేడ్-1 మున్సిపాల్టీగా మారిన తరువాత కాంట్రాక్టు ప్రాతిపదికన విడతల వారీగా 70 మందిని నియమించారు. ప్రస్తుతం శాశ్వత, కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తంగా 125 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. అయితే పురపాలక సంఘంలో నిన్నటి వరకు 30 వార్డులుండగా.. నేడు ఆ సంఖ్య 36కు చేరింది. దీంతో శాశ్వత, కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులపై పనిభారం పెరిగింది. పట్టణంలోని 36 వార్డుల నుంచి రోజుకు 10 టన్నుల నుంచి 15 టన్నుల వరకు చెత్తలను సేకరించి వాహనాల్లో డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. అయితే పెరిగిన జనాభాకు అనుగుణంగా వారి సంఖ్యను పెంచాలని ప్రజాసంఘాలు నిరసనలు తెలుపుతున్నా ఫలితం ఉండడం లేదు.
మున్సిపాల్టీ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణ శివారుల్లో కాలనీలు పుట్టగొడుగుల్లా ఏర్పడ్డాయి. దీంతో పారిశుధ్య నిర్వహణ సమస్య తీవ్రతరమవుతుంది. వాస్తవంగా వార్డుల్లో వీధుల నుంచి చెత్తల సేకరణ, కాలువలను శుభ్రపరిచేందుకు కనీసం నలుగు కార్మికులు అవసరం ఉంది. అయితే ప్రస్తుతం వీధుల్లో ఒక కార్మికుడు మాత్రమే చెత్తలు సేకరిస్తున్నారు. కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మరోవైపు పట్టణానికి ఆనుకొని డంపింగ్ యార్డు ఉండడంతో ప్రజలు దుర్వాసన , దోమల బెడదతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. తరచూ రోగాలపాలవుతున్నారు. ఈనెలాఖరులో కొలువుదీరనున్న మున్సిపల్ నూతన పాలకవర్గం ఈ సమస్యపై దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం..
ప్రస్తుతం ఉన్న పారిశుధ్య కార్మికులతో పట్టణంలోని 36 వార్డులను శుభ్రంగా ఉంచేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. అదనపు కార్మికుల భర్తీ విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు పాలకవర్గం దృష్టికి తీసుకెళ్తాం. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పారిశుధ్య నిర్వహణకు సంబంఽధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
- బి.రామ్‌గోపాల్, మున్సిపల్ కమిషనర్, పార్వతీపురం