Share News

సర్‌ ప్రక్రియలో జిల్లాకు 11వ స్థానం

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:58 PM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో జిల్లా ముందంజలో ఉందని, రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో ఉందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సర్‌ ప్రక్రియలో జిల్లాకు 11వ స్థానం
సిబ్బందికి సూచనలిస్తున్న ఇన్‌చార్జి జేసీ వైశాలి

పార్వతీపురం, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో జిల్లా ముందంజలో ఉందని, రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో ఉందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు నియోజకవర్గాల్లోని 1,032 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 7,90,562 మంది ఓటర్లు ఉండగా.. వంద శాతం ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4,78,882 ఫారాల డిజిటలైజేషన్‌(60.57 శాతం) అయ్యిందన్నారు. పాలకొండలో 64.92 శాతం, కురుపాం 64.80 శాతం, పార్వతీపురం 56.6 శాతం, సాలూరు 56.02 శాతం మేర డిజిటలైజేన్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు.

తప్పులు లేకుండా పూర్తిచేయండి: ఇన్‌చార్జి జేసీ

సాలూరు, జూలై6(ఆంధ్రజ్యోతి): తప్పులు లేకుండా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పూర్తిచేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి ఆదేశించారు. ఈ ప్రక్రియలో పాలకొండ, కురుపాం ముందుండగా పార్వతీపురం, సాలూరు నియోజక వర్గాలు వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ నెల 14లోగా మొత్తం పూర్తవుతుందని తెలిపారు. సోమవారం సాలూరులోని పోలింగ్‌ కేంద్రం నెంబరు 66లో సర్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన రికార్డులు, దరఖాస్తు ఫారాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా రికార్డులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పక్కాగా నిర్వహించాలని సూచించారు. డూప్లికేట్‌ ఓట్లు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం మండలంలోని తోణాం, కురుకూటి గ్రామాల్లో పర్యటించి.. సర్‌ ప్రక్రియపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఆమె వెంట తహసీల్దార్‌ ఎం.సురేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రత్నకుమార్‌ తదితరులు ఉన్నారు.

- వీరఘట్టం: నడుకూరులో సర్‌ ప్రక్రియను సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసు కున్నారు. పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అర్హుల వివరాలను తప్పకుండా నమోదు చేయాలని సూచించారు.

Updated Date - Jul 07 , 2026 | 11:29 AM