Discussions are positive చర్చలు సానుకూలం
ABN , Publish Date - May 21 , 2026 | 12:02 AM
Discussions are positive జిందాల్ యాజమాన్యానికి, భూ నిర్వాసితులకు మధ్య సాగుతున్న భూవివాదానికి తెరపడనుందా.. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందా.. నిర్వాసితులకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోందా.. బుధవారం పరిశ్రమ ప్రతినిధులు, భూనిర్వాసిత రైతులతో ఇన్‌చార్జి మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత జరిపిన చర్చలను బట్టి అవుననక తప్పదు.
చర్చలు సానుకూలం
జిందాల్ భూ వివాదానికి తెరదించే యోచనలో ప్రభుత్వం
నిర్వాసితుల సమస్యలపై దృష్టి
రైతుల గోడును సావధానంగా విన్న ఇన్‌చార్జి మంత్రి
ఎంఎస్‌ఎంఈ పార్కుల స్థాపనతో ఉపాధి కల్పన వైపు అడుగులు
జిందాల్ యాజమాన్యానికి, భూ నిర్వాసితులకు మధ్య సాగుతున్న భూవివాదానికి తెరపడనుందా.. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందా.. నిర్వాసితులకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోందా.. బుధవారం పరిశ్రమ ప్రతినిధులు, భూనిర్వాసిత రైతులతో ఇన్‌చార్జి మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత జరిపిన చర్చలను బట్టి అవుననక తప్పదు. విశాఖలో తొలిసారిగా ఇరు వర్గాలతో ఆమె సమావేశమయ్యారు. ఇన్‌చార్జి కలెక్టర్ సేతు మాధవన్, విజయనగరం ఆర్డీవో సుధాసాగర్, ఎస్.కోట తహసీల్దార్ డి.శ్రీనివాసరావు, ఉప తహసీల్దార్ రంజిత్‌కుమార్‌ల సమక్షంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసిత రైతుల తరుపున ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, పరిశ్రమ యాజమాన్యం తరుపున రాచూరి కనకారావు హాజరయ్యారు.
సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. అభ్యంతరాలను సానుకూ లంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ఇందుకు పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని జేఎస్‌డబ్ల్యూ వైస్ ప్రెసిడెంట్‌కు సూచించాం. భూ పరిహారం, పునరావాసం, ఉద్యోగ హామీ, పెండింగ్ సమస్యలు, కోర్టు కేసులు, రైతుల వినతులపై విస్తృతంగా చర్చించాలని అధికారులకు తెలిపాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
- ఆర్డీవో సుధాసాగర్, ఎస్.కోట తహసీల్దార్ డి.శ్రీనివాసరావులు బుధవారం సాయంత్రం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో హోంమంత్రి వంగలపూడి అనిత ఇచ్చిన హామీ
శృంగవరపుకోట, మే 20 (ఆంధ్రజ్యోతి):
హోంమంత్రి అనితతో విశాఖలో బుధవారం జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని రైతులు చెబుతున్నారు. సమస్యను కొలిక్కి తీసుకువస్తానని ఆమె ఇచ్చిన హామీతో న్యాయం జరుగుందని భావిస్తున్నారు. అయితే సమావేశానికి ముందే నిర్వాసిత రైతులు పలు సమస్యలను లిఖిత పూర్వకంగా అందించారు. ముషిడిపల్లి గ్రామానికి చెందిన 23 ఎకరాల సాగుభూమిని గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా నోటీస్‌లు ఇవ్వకుండా సేకరించడాన్ని తప్పుపట్టారు. బందవలసలో పునరావాసం పొందుతున్న తాటిపూడి ప్రాజెక్టు నిర్వాసితులను ఇప్పుడు రెండోసారి నిర్వాసితులను చేయడం అన్యాయమన్నారు. మూలబొడ్డవర, చినఖండేపల్లి, చీడిపాలెం, కిల్తంపాలెం గ్రామాల పరిధిలో జరిగిన భూ సేకరణలో 46.96 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఇలా అనేక సమస్యలను ప్రస్తావించారు. మంత్రి ఎదుట జరిగిన చర్చలో భూనిర్వాసితులు పేర్కొన్న ప్రతి సమస్యకు రెవెన్యూ అధికారులు లిఖిత పూర్వకంగా వివరణ చూపించారు. అధికారులు ఇచ్చిన వివరణలను బట్టి నిర్వాసిత రైతుల సమస్యలకు ప్రభుత్వ పరంగా పరిష్కార మార్గం చూపేలా హోంమంత్రి మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఎన్ని సమస్యలు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ప్రధానంగా షేర్లు వాటా సొమ్ము పెంచాలని, యాజమాన్యంకు ఇచ్చిన భూముల్లో అక్రమాలను నిరోధించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని భూ నిర్వాసితులు గట్టిగా కోరినట్లు రెవెన్యూ వర్గాల చెబుతున్నాయి.
ఫ ప్రాథమికంగా సమస్యలను తెలుసుకున్న హోంమంత్రి అనిత నిర్వాసిత రైతులు, పరిశ్రమ యాజమాన్యంతో మరో దఫా చర్చలు జరపాలని పేర్కొన్నారు. అంతటితో ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టి ఆ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను స్థాపించాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ మొదటి వారంలో వీటికి భూమి పూజ చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లు వస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈలోపే యాజమాన్యంకు, రైతులకు మధ్యనున్న వివాదానికి పరిష్కారం చూపే అవకాశం ఉంది.