ఖైదీలపై వివక్ష తగదు
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:14 AM
విజయనగరం సబ్‌జైలును బోర్డు ఆఫ్ విజిటర్స్ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు.
దాసన్నపేట, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): విజయనగరం సబ్‌జైలును బోర్డు ఆఫ్ విజిటర్స్ ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా న్యాయాధి కారి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్‌పర్సన్ ఎం.బబిత, సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ జైలును సందర్శించి.. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఖైదీలకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించి, పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు ఎలాంటి వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు తీర్పును వివరించారు. వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను తనిఖీ చేసి.. న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్ల సేవలపై ఆరా తీశారు. రిమాండ్ ఖైదీలకు న్యాయవాది లేకుండా ఉండకూడదని, అవసరమైన వారికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహా యం అందిస్తామని తెలిపారు. ఖైదీలు నేర ప్రవృత్తిని విడనాడి, మంచి పౌరులాగా మరాలని సూచించారు. అనంతరం వంటగది, భోజనశాల, స్టోర్ రూమ్‌లను పరిశీలించి.. ఆహార పదార్థాలు, పప్పు దినుసులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, అడిషన్ ఎస్పీ సౌమ్యలత, ఆరోగ్య, ఆర్‌అండ్‌బీ, సాంఘిక సంక్షేమ, ఉపాధి, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.