Discolored Water రంగు మారిన నీరు
ABN , Publish Date - Nov 08 , 2026 | 12:28 AM
Discolored Water జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీలో గత వారం, పది రోజుల నుంచి సక్రమంగా తాగునీటి సరఫరా కావడం లేదు. దీంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోటపల్లిలోని నాగావళికి వరద పోటెత్తుతుండగా.. ప్రధాన పంప్‌హౌస్ వద్ద ఇన్‌ఫిల్టర్ బావులు నదిలో ముగినిపోయాయి. మోటార్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది.
జిల్లాకేంద్రవాసులకు తప్పని ఇక్కట్లు
నాగావళి నదిలో మునిగిన ఇన్‌ఫిల్టర్ బావులు.. పాడైన మోటార్లు
అధికారుల నిర్లక్ష్యంపై పెదవి విరుపు
నూతన పాలకవర్గంపై ఆశలు
పార్వతీపురం టౌన్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీలో గత వారం, పది రోజుల నుంచి సక్రమంగా తాగునీటి సరఫరా కావడం లేదు. దీంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోటపల్లిలోని నాగావళికి వరద పోటెత్తుతుండగా.. ప్రధాన పంప్‌హౌస్ వద్ద ఇన్‌ఫిల్టర్ బావులు నదిలో ముగినిపోయాయి. మోటార్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. వారం రోజులకొకసారి రంగు మారిన నీరు సరఫరా అవుతుండడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణశాఖతో పాటు జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసినా.. మున్సిపల్ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోకపో వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పట్టణ శివారుల్లో ఉన్న కాలనీలకు వారం రోజులకొకసారి మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతవాసులు బిందెడు నీటి కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మొత్తంగా 36 వార్డుల్లో ప్ర‘జల’ కష్టాలు తీరడం లేదు. వర్షాకాలంతో పాటు అన్ని కాలాల్లో రంగు మారిన నీటిని సరఫరా చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆ నీటిని తాగుతుండడం వల్ల డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా తాగునీటి సరఫరాకు సంబంధించి ఏటా రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు మున్సిపల్ ఇంజనీరింగ్ చెబుతున్నారు. అయినప్పటికీ సరఫరా మెరుగుపడకపోవడం బాఽధాకరం. తాగునీటి సమస్య పరిష్కారంపై గత వైసీపీ పాలకవర్గం హామీలకే పరిమితమైంది. త్వరలో కొలువుదీరనున్న నూతన మున్సిపల్ పాలకవర్గమైనా దీనిపై దృష్టి సారించి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లాకేంద్ర వాసులు కోరుతున్నారు.
ఏటా ఇదే పరిస్థితి..
ఏటా వర్షాకాలంలోనే కాదు.. అన్నీ కాలాల్లో మున్సిపాలిటీలో తాగునీటి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం వారం నుంచి పదిరోజులుగా తాగునీటి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి.
- వి.కామేశ్వరరావు, పార్వతీపురం
=======================
ఇంత నిర్లక్ష్యమెందుకు..?
గత కొన్నేళ్లుగా తాగునీటి సరఫరాకు సంబంధించి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏటా తాగునీటి సరఫరాకు సంబంధించి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. ప్రజల దాహార్తిని తీర్చలేకపోవడం బాధాకరం.
- పి. సన్యాసిరావు, ప్రజా సంఘ నాయకుడు, పార్వతీపురం
============================
పనులు ప్రారంభించాం
తాగునీటి సరఫరాను పునరిద్ధరించేందుకు పనులు ప్రారంభించాం. నాగావళి నదికి వరద పోటెత్తడంతో ఇన్‌ఫిల్టర్ బావులు మునిగిపోయాయి. వరద ఉధృతి కారణంగా బావుల్లో ఉన్న మోటార్లను మరమ్మతు చేయడానికి అవకాశం కుదరడం లేదు. రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి.. అన్ని వార్డులకు తాగునీటి సరఫరా చేస్తాం.
- రామ్‌గోపాల్, కమిషనర్, పార్వతీపురం మున్సిపాలిటీ