పట్టుదల ఉంటే వైకల్యం అడ్డు కాదు
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:09 AM
పట్టుదల ఉంటే వైకల్యం అడ్డు కాదని భారతదేశ మహిళా అంధుల క్రికెట్ జట్టు నిరూపించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్
అంధుల టీ20 మహిళల వరల్డ్ కప్ విజేతలకు ఘన సన్మానం
కొత్తవలస, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టుదల ఉంటే వైకల్యం అడ్డు కాదని భారతదేశ మహిళా అంధుల క్రికెట్ జట్టు నిరూపించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళా అంధుల టీ20 వరల్డ్ కప్-2025లో విజయం సాధించిన క్రికెట్ జట్టును ఆయన మండలంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టులో ఆదివారం ఘనంగా సన్మానించారు. గురుదేవ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్థ వార్షికోత్సవానికి అంధుల క్రికెట్ జట్టు హాజరయ్యింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించే విధంగా క్రికెట్‌లో తమ ప్రతిభాపాటవాలను నిరూపించారన్నారు. అనంతరం క్రికెట్ సభ్యుల కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని ఆయన చలించిపోయారు. అలాగే గురుదేవా ట్రస్టు సేవలను కొనియాడారు. క్రికెట్ టీంలో 16 మంది సభ్యులకు హిందుస్థాన్ షిప్‌యార్డు సౌజన్యంతో రూ.50వేల చొప్పున మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ గుడిపూడి నారాయణస్వామి, షిప్‌యార్డు ఫైనాన్స్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ కిరణ్, ఇండియన్ బ్లైండ్ ఉమెన్ క్రికెట్ చైర్మన్ అజయ్‌రెడ్డి, గురుదేవ ట్రస్టు వైస్ చైర్మన్ డా.ఫణీంద్ర, ట్రస్టు మెంబర్ బీఎన్‌రావు తదితరులు పాల్గొన్నారు.