Share News

berm! చెరువు మట్టి తవ్వి.. బెర్ము వేసి!

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:35 PM

Dig up the pond soil and add a berm! గరుగుబిల్లి నుంచి బీవీ పురం వరకు చేపడుతున్న బీటీ రహదారి నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదు. పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి. సాగునీటి చెరువుకు నష్టం కలిగించేలా రోడ్డు నిర్మాణం చేపడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంఽధిత అధికారులకు వారు ఫిర్యాదు చేశారు.

 berm! చెరువు మట్టి తవ్వి.. బెర్ము వేసి!
రహదారికి ఇరువైపులా చెరువు మట్టిని బెర్ముగా వేసిన దృశ్యం

  • నిబంధనలు పాటించని వైనం

  • ఆందోళనలో రైతులు

  • అధికారులకు ఫిర్యాదు

గరుగుబిల్లి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి నుంచి బీవీ పురం వరకు చేపడుతున్న బీటీ రహదారి నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదు. పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి. సాగునీటి చెరువుకు నష్టం కలిగించేలా రోడ్డు నిర్మాణం చేపడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంఽధిత అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. వాస్తవంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా గరుగుబిల్లి నుంచి బీవీ పురం వరకు మూడు కిలోమీటర్ల రహదారికి రూ. 3కోట్లు మంజూరయ్యాయి. మధ్యలో రెండు కల్వర్టులను నిర్మించాల్సి ఉంది. కాగా ఇటీవల ఈ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే నిర్మాణానికి ముందు గతుకులమయమైన రహదారి వ్యర్థాలను తొలగించి.. రోలింగ్‌ నిర్వహించాలి. ఆ తర్వాత రహదారులకు ఇరువైపులా బెర్మ్‌లను ఏర్పాటు చేయాలి. నిబంధనల మేరకు రహదారి ప్రాంతం నుంచి సుమారు ఆరు కిలో మీటర్ల దూరం నుంచి నాణ్యతతో కూడిన మట్టిని తెచ్చి ఉపయోగించాల్సి ఉన్నా.. ఆ పనులేవీ చేయడం లేదు. రహదారి దిగువ భాగంలోని దక్షిణాయని చెరువుకు చెందిన ప్రాంతంలో మట్టిని తీసి రహదారి బెర్మ్‌లుగా ఉపయోగిస్తున్నారు. చెరువులోని మట్టిని ఉపయోగించడంతో గట్టు బలహీనపడుతుందని పెద్దూరుకు చెందిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు దిగువన సుమారు 300 ఎకరాల ఆయకట్టు ఉందని, అధికంగా వర్షాలు కురిసే సమయంలో గండ్లు పడే పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

చర్యలు తప్పవు

నిబంధనల మేరకు గరుగుబిల్లి నుంచి బీవీ పురం వరకు బీటీ రహదారి నిర్మాణాన్ని చేపట్టాలి. నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. లేకుంటే చర్యలు తప్పవు. చెరువుకు నష్టం కలిగించేలా కాంట్రాక్టర్లు పనులు చేపడుతున్నారని పెద్దూరు ప్రాంతానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. పనులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- ఎన్‌.వెంకటరావు, డీఈఈ, పంచాయతీరాజ్‌ శాఖ

Updated Date - Feb 18 , 2026 | 11:35 PM