Intermediate Education! ఇంటర్ చదువుకు ఇక్కట్లు!
ABN , Publish Date - May 29 , 2026 | 10:54 PM
Difficulties in Pursuing Intermediate Education! ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యార్థులకు ఉన్నత చదువుల కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న వారికి ఇంటర్‌లో సీట్లు లభించడం లేదు. డిమాండ్‌కు తగ్గట్టుగా గిరిజన గురుకుల కళాశాలలో అదనపు సీట్లు మంజూరు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణం.
సీట్ల పెంపు కోసం ఆశగా ఎదురుచూపు
పదుల సంఖ్యలో సీట్లు.. వేలల్లో దరఖాస్తులు
బాలికల కళాశాలల్లో తీవ్ర పోటీ
కటాఫ్ మార్కులు సాధించినా.. దక్కని ప్రవేశం
నిరాశతో వెనుదిరుగుతున్న గిరిజన విద్యార్థినులు
సీతంపేట రూరల్, మే29(ఆంధ్రజ్యోతి): ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యార్థులకు ఉన్నత చదువుల కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న వారికి ఇంటర్‌లో సీట్లు లభించడం లేదు. డిమాండ్‌కు తగ్గట్టుగా గిరిజన గురుకుల కళాశాలలో అదనపు సీట్లు మంజూరు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణం. మొత్తంగా ఎంతోమంది గిరిజన విద్యా ర్థులు ఇంటర్ చదువులకు దూరమవుతున్నారు. ముఖ్యంగా బాలికలు పూర్తిగా ఇంటికే పరిమిత మవుతున్నారు. జిల్లాలో ఎనిమిది వరకు ఏపీఆర్ గురుకుల జూనియర్ బాలుర, బాలికల కళా శాలలు ఉన్నాయి. వాటిల్లో మొత్తంగా 1030 సీట్లు ఉండగా.. ఇటీవల జరిగిన కౌన్సెలింగ్‌కు 2,364 మంది గిరిజన విద్యార్థులు హాజరయ్యారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో మూడు, పార్వతీపురం పరిధిలో ఉన్న ఐదు గురుకుల కళాశాలల్లో ఎక్కువ శాతం గిరిజన విద్యార్థులు బైపీసీ, ఎంపీసీ గ్రూప్‌ల్లో చేరేందుకు పోటీపడ్డారు.
ఇదీ పరిస్థితి..
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 20 టీఎస్పీ మండలాల్లో మూడు మాత్రమే గిరిజన గురుకుల బాలికల, బాలుర కళాశాలలు ఉన్నాయి. వాటిలో బాలికల కోసం సీతంపేటలో ఒక్క కళాశాల మాత్రమే ఉంది. దీంతో ప్రవేశాల సమయంలో విద్యార్థినుల మధ్య తీవ్ర పోటీ నెలకొం టోంది. మెరిట్, కటాఫ్ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నప్పటికీ వందల సంఖ్యలో గిరిజన బాలికలకు సీట్లు దక్కడం లేదు. దీంతో వారు ఉన్నత చదువులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. నిరుపేదలైన గిరిజనులు తమ ఆడబిడ్డలను మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ కళాశాలల్లో చదివించలేకపోతున్నారు. దీంతో గిరిజన బాలికలు టెన్త్ తర్వాత చదువులకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. ఇదే సమయంలో నిరక్షరాస్యులైన వారి తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేసేందుకు సిద్ధపడు తున్నారు.
సీతంపేటలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో జనరల్‌లో 120సీట్లు, ఒకేషనల్ కోర్సులో 20సీట్లు మాత్రమే కేటాయించారు. అయితే ఆన్‌లైన్‌లో 519మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ మేరకు రెండు రోజుల కిందట ఐటీడీఏ అధికారులు, గురుకుల కళాశాల సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహించారు. కటాఫ్ మార్కులు 508గా నిర్ణయించడంతో అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన గిరిజన బాలికలు సీట్లు సాధించలేకపోయారు. ఈ కౌన్సెలింగ్‌లో 256మంది బాలికలు 140 సీట్లకు పోటీపడ్డారు. వీరిలో మెరిట్‌మార్కుల ఆధారంగా 140మందికి సీట్లు కేటాయించగా మిగిలిన 116మందికి సీట్లు దక్కలేదు. కాగా బాలికల గురకుల కళాశాలలో ఈఏడాది బైపీసీ గ్రూప్‌నకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మెరిట్ మార్కులు సాధించిన గిరిజన విద్యార్థినులు ఎక్కువగా బైపీసీ, ఎంపీసీ గ్రూప్‌లో ప్రవేశాలకు పోటీపడ్డారు.
ఫ గురుకుల సెక్రటరీకి సీట్ల పెంపు కోసం ఆయా కళాశాలలు ప్రతిపాదనలు పంపడం ... ఈ మేరకు అదనంగా 30 వరకు సీట్లు కేటాయించడం ఏటా జరుగుతోంది. అయితే ఈ సీట్లు పెంపు ప్రక్రియ ఆలస్యం కావడంతో ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. అప్పటికే కొంతమంది ఆర్థికభారమైనప్పటికీ ప్రైవేట్ కాలేజీల్లో చేరుతున్నారు. మరికొంత మంది సీట్లు పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తూ.. చదువుకు దూరమవుతున్నారు.
బాలుర కళాశాలల్లో భిన్న పరిస్థితి..
ఫ సీతంపేట గిరిజన గురుకుల బాలుర, పెద్దమడి బాలుర కళాశాలల్లో ఇంటర్మీడియట్ సీట్లకు ఈఏడాది డిమాండ్ తగ్గింది. సీతంపేట ఏపీఆర్ బాలుర కళాశాలలో మొత్తంగా ఎంపీసీ 40, బైపీసీ 40, హెచ్‌ఈసీలో 40సీట్లతో పాటు ఒకేషనల్ కోర్సులో 50సీట్లుకు ఇటీవల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ 120 సీట్లుకు గాను కటాఫ్ మార్కులు 440గా నిర్ణయించి కౌన్సెలింగ్ చేపట్టారు. సీతంపేట బాలుర కళాశాలలో జనరల్‌లో ఉన్న 120సీట్లు భర్తీకాగా ఒకేషనల్‌లో ఉన్న 50సీట్లకు గాను 37సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన 13సీట్లు ఈ కళాశాలలో ఖాళీగా ఉన్నాయి
ఫ పెద్దమడి గిరిజన గురకుల బాలుర కళాశాలలో గత ఏడాది(2025-26)ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్‌లో జనరల్ గ్రూప్‌ల్లో మొత్తంగా 86మంది గిరిజన విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో కేవలం 17మంది(19.76)శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఈ కళాశాలలో చేరేందుకు గిరిజన విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. పెద్దమడి గిరిజన బాలుర కళాశాలలో బైపీపీ 40, ఎంపీసీ 40, సీఈసీ 40సీట్లుకు కౌన్సెలింగ్ నిర్వహించగా వాటిలో 51సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన 69(బైపీసీ 23, ఎంపీసీ 21, సీఈసీ 25)సీట్లు ఇంకా భర్తీకావాల్సి ఉంది. సీతంపేట ఏసీఆర్ బాలికల గురుకుల కళాశాలలో సీట్లకు తీవ్రమైన పోటీ ఉంటే బాలుర కళాశాలల్లో మాత్రం భిన్న పరిస్థితి నెలకొంది.
డీడీ ఏమన్నారంటే...
‘సీతంపేటలోని ఏపీ ఆర్ గురుకుల బాలికల కళాశాలలో సీట్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. గడిచిన రెండు రోజుల కిందట మెరిట్ మార్కుల ఆధారంగా గిరిజన విద్యార్థినులకు సీట్లు కేటాయించాం. అయితే అదనపు సీట్లు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిస్తాం.’ అని గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎం.అన్నాదొర తెలిపారు.