Share News

భూ మార్పిడికి కష్టాలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:55 PM

వారసత్వ భూములను మార్పు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

భూ మార్పిడికి కష్టాలు

- వారసత్వ భూముల బదిలీకి కొత్త నిబంధనలు

- రెవెన్యూ నుంచి రిజిస్ట్రేషన్‌ శాఖకు అధికారం బదలాయింపు

- సాంకేతిక సమస్యలతో తప్పని ఇబ్బందులు

- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు

విజయనగరం, కలెక్టరేట్‌ సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వారసత్వ భూములను మార్పు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ (ఎఫ్‌ఎంసీ) ఆధారంగా గతంలో ఈ భూములను సంబంధిత కుటుంబ సభ్యులకు రెవెన్యూ అధికారులు బదిలీ చేసేవారు. ఈ విధానాన్ని ప్రభుత్వం మార్పు చేసింది. వారసత్వ భూములను మార్చే అధికారాన్ని రెవెన్యూ శాఖ నుంచి రిజిస్ట్రేషన్‌ శాఖకు బదిలీ చేస్తూ ఇటీవల జీవో జారీ చేసింది. దీంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. గత మూడు నెలల నుంచి ఈ పరిస్థితి నెలకొనడంతో అత్యవసర పరిస్థితిలో భూములను విక్రయించునేందుకు వారు కష్టాలు పడుతున్నారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. భర్త ఏదైనా కారణంతో మరణిస్తే, ఆయన నుంచి వారసత్వంగా వచ్చిన భూములను భార్య లేదా పిల్లల పేరున మార్చాలంటే గతంలోఎఫ్‌ఎంసీ ఉంటే సరిపోయేది. దీని ఆధారం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు పరిశీలించి ఆ భూములను భార్య లేదా పిల్లల పేరిట సులువుగా మార్పు చేసేవారు. తాజాగా, ప్రభుత్వం ఇచ్చిన జీవోతో వారసత్వ భూముల మార్పు కష్టంగా మారింది. సాధారణంగా భూములను ఒకరి నుంచి మరొకరి పేరున బదిలీ చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి పద్ధతి ప్రకారం.. ఎవరైనా భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే, అక్కడే ఆటోమ్యుటేషన్‌ విధానంలో కొనుగోలు చేసుకున్న వ్యక్తి పేరున 1బి మంజూరవుతుంది. రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా నేరుగా కొనుగోలు చేసుకున్న వ్యక్తి పేరున భూమి మారుతుంది. రెండో పద్ధతి ప్రకారం.. ఇంటిలో తల్లిదండ్రులు మరణిస్తే వారి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని పిల్లల పేరున మార్చాలంటే మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ అవసరం ఉండేది. వాటి ప్రకారం రెవెన్యూ అధికారులు భూములను మార్పు చేసేవారు. ఇప్పుడీ అధికారాన్ని ప్రభుత్వం సబ్‌ రిజిస్ట్రార్లకు కట్టబెట్టింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఎఫ్‌ఎంసీలో ఎంతమంది పేర్లు ఉంటే అందరి పేరున సమాన వాటాగా చేయాలి. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. గతంలో వివాహం జరిగిన ఆడపిల్లలకు కూడా సమాన వాటా ఇచ్చేందుకు సంబంధిత కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికితోడు సాంకేతిక సమస్యలు రావడంతో సబ్‌ రిజిస్ట్రార్లు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేపోతున్నారు. దీంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా రిజిస్ట్రార్‌ ఎస్‌.మోహన్‌రావు మాట్లాడుతూ.. ‘ఎఫ్‌ఎంసీ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్లతో మాట్లాడి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తాం’ అని తెలిపారు.

Updated Date - Sep 11 , 2026 | 11:55 PM