వచ్చామా?.. వెళ్లామా?
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:07 AM
జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. ఏదో వచ్చామా? వెళ్లామా? అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
- జిల్లాలో మొక్కుబడిగా ‘పొలం పిలుస్తోంది’
- కేవలం ఫొటోలకే పరిమితమవుతున్న అధికారులు
- రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వని వైనం
- పత్తాలేని వ్యవసాయ అనుబంధ శాఖలు
విజయనగరం ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. ఏదో వచ్చామా? వెళ్లామా? అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతి మంగళ, బుధ వారాల్లో గ్రామాల్లో ఏదో ఒక పొలంలో బ్యానర్ పెట్టడం.. ఆ సమయంలో అక్కడ ఉన్న రైతులతో ఒక ఫొటో దిగడం.. దాన్ని వారి ముఖ్య కార్యాలయానికి అప్‌లోడ్ చేయడం.. ఆ రోజు కార్యక్రమానికి అయే ఖర్చులను బిల్లులు పెట్టుకోవడం.. ఇదే ‘పొలం పిలుస్తోంది’ పేరిట నిత్యం జరగుతున్న తంతు. రైతులకు సాగుపై అవగాహన కల్పించడం గానీ, సూచనలు, సలహాలు ఇవ్వడం గానీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ కార్యక్రమంతో రైతులకు ఒనగూరే ప్రయోజనాలేవీ లేకుండా పోయాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. ఖరీఫ్‌లో 1.41 లక్షల హెక్టార్లలో, రబీలో 80,243 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగుచేస్తుంటారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, రాగులు, ఉలవలు, పెసర, మినుము, చెరకు, నువ్వులు, కూరగాయలు వంటివి పండిస్తుంటారు. అయితే, ప్రతి సంవత్సరం వాతావరణ ప్రతికూల పరిస్థితులు, చీడపీడలు, తెగుళ్లతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంటుంది. సరైన సాగు సలహాలు లేక ఏటా రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి 2024 సెప్టెంబరు 10న శ్రీకారం చుట్టింది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ శాఖలైన మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమ, సేంద్రియ, మార్కెటింగ్ శాఖ అధికారులను పొలంబాట పట్టాలని ఆదేశించింది. వీరంతా రైతులతో సమావేశాలు కావాలి. వారికి సరైన సాగు సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఖరీఫ్, రబీలో చెరో నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ప్రతి మంగళ, బుధవారాల్లో విధిగా నిర్వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. అయితే, జిల్లాలో ఈ ఏడాదిన్నరలో అధికారులు కేవలం ఫొటోలకు మాత్రమే పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి.
కానరాని కార్యక్రమాలు..
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి అభ్యుదయ రైతులను ప్రోత్సహించాలి. ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించాలి. ఉద్యానవన పంటల సాగులో మెలకువలు నేర్పించాలి. భూసార పరీక్షలు నిర్వహించాలి. మట్టి నమూనాలను సేకరించాలి. అందుకు అనుగుణంగా వినియోగించాల్సిన ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. మార్కెటింగ్ కమిటీల ద్వారా ఉత్పత్తులను విక్రయించేందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పంటల సాగులో పెట్టుబడులు తగ్గించి ఆదాయం పెంచేందుకు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఆధునిక సేద్యంపై అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు పంట దిగుబడి తగ్గడాన్ని విశ్లేషించడం, సూక్ష్మపోషణ లోపాన్ని గుర్తించి భూసారం పెంచేలా సూచనలు చేయడం, భూసార కార్డుల పంపిణీ, తుంపర, బిందు సేద్యం దిశగా ప్రోత్సహించడం చేయాలి. కౌలురైతుల గుర్తింపు కార్డుల జారీ, రైతుమిత్ర సంఘాల ఏర్పాటు, వ్యవసాయ సంఘాల ద్వారా రుణాల మంజూరు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం వంటి వాటిపై రైతులను చైతన్యవంతం చేయాల్సి ఉంది. కానీ చాలా మండలాల్లో ఈ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఆదేశాలు బేఖాతరు..
వ్యవసాయరంగానికి అనుబంధంగా ఉన్న సుమారు 14 శాఖల సేవలను వినియోగించుకోవాలని, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కానీ, ప్రభుత్వ ఆదేశాలను కొందరు అధికారులు బేఖాతరు చేస్తున్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల, నియోజకవర్గస్థాయి అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. వ్యవసాయశాఖ సిబ్బంది తప్ప మిగిలినవారు గ్రామాల్లో నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరు కావడంలేదు. ఈ విషయంపై ఏడీఏ మధుసూధనరావుని వివరణ కోరగా ‘పొలం పిలుస్తోంది కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనకపోవడం వాస్తవమే. అందరూ వస్తే రైతులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంటుంది. మేలైన దిగుబడులు పొందేలా మార్కెటింగ్ చేసుకునేలా చైతన్యం కల్పించవచ్చు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా’.అని తెలిపారు.