చంపేశారా?
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:33 PM
కనిమెరక గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
- వివాహిత అనుమానాస్పద మృతి
- అదనపు కట్నం కోసం వేధింపులు
- అల్లుడే హత్య చేశాడంటున్న తల్లి
- బేలచూపులు చూస్తున్న పిల్లలు
బొండపల్లి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కనిమెరక గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గజపతినగరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సామంతుల సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిమెరకకు చెందిన బుంగ రామముత్యాలు, అదే గ్రామానికి చెందిన చింతల సంధ్య (24) ఎనిమిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లు సంసారం సజావుగా సాగింది. పిల్లలు పుట్టిన తరువాత రామముత్యాలు మద్యానికి బానిసయ్యాడు. అదనపు కట్నం తేవాలని నిత్యం భార్యను, ఆమె కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు వారి మధ్య ఘర్షణలు, తగాదాలు జరిగేవి. సోమవారం రాత్రి ఎప్పటిలాగే ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గాయపడిన సంధ్య అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో రామముత్యాలు 108కి ఫోన్ చేశాడు. వారువచ్చి చూడగా అప్పటికే సంధ్య మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐతో పాటు బొండపల్లి పోలీసులు గ్రామానికి చేరుకుని మృతురాలి ఇంటితో పాటు పరిసరాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం కూడా వచ్చి పరిశీలించింది. సంధ్య కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త రాముత్యాలను అదుపులోకి తీసుకున్నారు.
అల్లుడే పొట్ననపెట్టుకున్నాడు..
‘ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకుంటాం.. సుఖంగా సంసారం సాగిస్తామని చెప్పిన రామముత్యాలు అనునిత్యం అదనపు కట్నంకోసం నా బిడ్డను వేధించేవాడు. సోమవారం రాత్రి నా అల్లుడే నా కుమార్తెను పొట్టనపెట్టుకున్నాడు’ అని మృతురాలు తల్లి చింతల ఈశ్వరమ్మ భోరున విలపించింది.
అయ్యో చిన్నారులు..
తల్లి మృతదేహాన్ని చూసి, ఏమి జరిగిందో తెలియక మూడో తరగతి చదువుతున్న కుమారుడు ధర్మతేజ (లక్కీ), ఒకటో తరగతి చదువుతున్న కుమారుడు రష్మిక బేలచూపులు చూస్తున్నారు. ఇక మాకు ఎవరు స్నానం చేస్తారు.. అన్నం ఎవరు పెడతారు.. స్కూల్‌కు ఎవరు బయలుదేరిస్తారు అన్నట్లు తల్లి మృతదేహం వద్ద వారు ధీనంగా ఉండడాన్ని చూసిన స్థానికులు కలత చెందుతున్నారు. మరోపక్క తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అయ్యో చిన్నారుల పరిస్థితి ఏంటని విచారం వ్యక్తం చేస్తున్నారు.