Did medical negligence claim the life? వైద్యులు నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా?
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:45 AM
Did medical negligence claim the life? ఆ గిరిజనుడ్ని రక్షించుకునేందుకు కుటుంబ సభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. గ్రామం నుంచి ఆస్పత్రికి తరించేందుకు డోలీ కట్టారు. పొదల మధ్య నది వద్దకు చేర్చారు. ఆపై తెప్పపై నది దాటించి ఆస్పత్రికి చేర్చారు. వైద్యులు పరీక్షించి మందులిచ్చారు. వాటిని తీసుకుని ఇంటికి తిరుగుప్రయాణం అవ్వగా మార్గమధ్యలోనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. లోతుగెడ్డ పంచాయతీ శివారు గిరిజన గ్రామం కొండపర్తి బాడవకు చెందిన అంజి సీతందొర (70) విషాదాంతమిది.
వైద్యులు నిర్లక్ష్యమే ప్రాణం తీసిందా?
గిరిజనుడ్ని డోలీలో పొదలు దాటించి ఆస్పత్రికి తీసుకువెళ్లిన వైనం
తూతూమంత్రంగా మందులిచ్చి పంపేసిన వైద్యులు
తిరుగుప్రయాణంలో ప్రాణాలు విడిచిన రోగి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్న కుటుంబ సభ్యులు
మృతదేహాన్ని నది దాటించలేక ఇవతలే అంత్యక్రియలు
మెంటాడ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఆ గిరిజనుడ్ని రక్షించుకునేందుకు కుటుంబ సభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. గ్రామం నుంచి ఆస్పత్రికి తరించేందుకు డోలీ కట్టారు. పొదల మధ్య నది వద్దకు చేర్చారు. ఆపై తెప్పపై నది దాటించి ఆస్పత్రికి చేర్చారు. వైద్యులు పరీక్షించి మందులిచ్చారు. వాటిని తీసుకుని ఇంటికి తిరుగుప్రయాణం అవ్వగా మార్గమధ్యలోనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. లోతుగెడ్డ పంచాయతీ శివారు గిరిజన గ్రామం కొండపర్తి బాడవకు చెందిన అంజి సీతందొర (70) విషాదాంతమిది. తూతూమంత్రంగా వైద్యులు పరీక్షించి మందులిచ్చారని, వారి నిర్లక్ష్యం వల్లే ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కొండపర్తి బాడవకు చెందిన అంజి సీతందొర (70) శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి తీవ్ర ఆయాసానికి గురయ్యారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు డోలీలో సీతందొరను సుమారు కిలోమీటరు మేర పొదలు దాటుకుని, ఆ తర్వాత మరో కిలోమీటరు పొడవున తెప్పపై చంపావతి నది దాటించారు. కొండపర్తి గ్రామం చేరుకొన్నాక 108 వాహనంలో గజపతినగరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి మందులు రాసిచ్చారు. రోగం నయం అవ్వకపోతే పదిరోజుల తరువాత రావాలని చెప్పారు. దగ్గు,ఆయాసం, ఎగ ఊపిరి ఎక్కువగా ఉన్నందున కుటుంబ సభ్యులు మళ్లీ వైద్యసిబ్బందిని సంప్రదించారు. అదేమీ పెద్ద సీరియస్ కేసు కాదని, మందులు వేసుకుంటే తగ్గిపోతుందని సలహా ఇచ్చారని కుటుంబ సభ్యులు వాపోయారు. అక్కడ్నుంచి ఆటోలో మళ్లీ కొండపర్తికి తీసుకురాగా తామందరం చూస్తుండగానే తండ్రి నేలకొరిగిపోయి కన్నుమూశారని కుమారుడు ఎర్రన్నదొర కన్నీటి పర్యంతమయ్యాడు. వైద్యుల నిర్లక్ష్యమే తనతండ్రి ప్రాణం తీసిందని ఆరోపించాడు. ఎగ ఊపిరితో బాధపడుతున్న వ్యక్తిని 108 ద్వారా విజయనగరం పంపించినా తనతండ్రి బతికేవాడేమోనని వాపోయాడు.
వైద్యుల నిర్లక్ష్యం కాదా?
రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాలి. వారిని ప్రభుత్వ వాహనంలో తరలించాలి. వైద్యులు ఎందుకు ఆ పని చేయలేదు? పోనీ విజయనగరం ఆసుపత్రికి రోగిని తీసుకొని వెళ్లాలని సూచిస్తే, మందులు ఎందుకు రాసినట్లు? రోగి బంధువులకు మందులు ఎందుకు అందజేసినట్లు? సూపరింటెండెంట్ చెప్పినట్లు రోగికి గుండె సంబంధిత రోగం ఉంటే... ఆసుపత్రిలో అందుబాటులోనున్న ఈసీజీ పరీక్ష చేయకుండా, 2డిఎకో పరీక్ష చేయాలని ఎలా సూచిస్తారు అన్నది కుటుంబ సభ్యుల ప్రశ్న.
నది దాటించలేక.. నది ఈవల అంత్యక్రియలు
సీతందొర మరికొన్ని నిమిషాలపాటు ప్రాణం నిలిచి ఉంటే పుట్టిపెరిగిన ఊరుకు ఆయన మృతదేహాన్ని తరలించేవారు. కొండపర్తి చేరేసరికి ఆయన ప్రాణాలొదిలాడు. ఆ సమయంలో నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండడంతో నది దాటించడం అసాధ్యమైంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంపావతి నది ఈవల ఒడ్డున కొండపర్తి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే..
గజపతినగరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే నా తండ్రి ప్రాణాన్ని బలిగొంది. 108 వాహనంలో విజయనగరం తరలించినా ఫలితం ఉండేది. మందుల కోసం మూడు గంటలు రాత్రి 8 వరకు వేచి ఉన్నాం. కొన్ని మాత్రలు ఇచ్చి ఇంటికి వెళ్లాలన్నారు. విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకొని, మరొకరికి ఇలా జరగకుండా చూడాలి.
ఎర్రన్నదొర, కుమారుడు
వైద్యుల సలహా పాటించలేదు
సీతందొర మృతిపై మా సిబ్బందిపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. సీతందొరకు గుండె సంబంధిత సమస్య ఉంది. 2డి ఎకో తీసుకోవాలని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని చికిత్స అందించిన వైద్యులు చెప్పారు. వారు వైద్యుల సలహా పాటించలేదు.
కొచ్చర్లకోట జగదీశ్వరరావు, సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, గజపతినగరం
వంతెన ఏర్పాటు చేయాలి
వర్షం వచ్చినప్పుడు కొండపర్తి బాడవ, మువ్వల బాడవ తండాలకు చెందిన సుమారు ఇరవై కుటుంబాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. పచారీ సామాన్ల కోసం వెళ్లాలన్నా ఇక్కట్లు తప్పడం లేదు. పిల్లలు సైతం తెప్పపై నదిలో రెండుపూటాలా ప్రయాణం చేసి బడికి వెళ్లే పరిస్థితి. నదిపై వంతెన ఏర్పాటు చేసి ఆదుకోవాలి.
- గౌరి శంకర్, గిరిజనుడు, కొండపర్తిబాడవ