Development of Uttarandhra with the arrival of airport ఎయిర్‌పోర్టు రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధి
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:25 AM
Development of Uttarandhra with the arrival of airport భోగాపురం ఎయిర్‌పోర్టు రాకతో ఉత్తరాంధ్ర దశ మారిపోతుందని, అనేక పరిశ్రమలు వస్తాయని రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు.
ఎయిర్‌పోర్టు రాకతో
ఉత్తరాంధ్ర అభివృద్ధి
అనేక పరిశ్రమల రాక
విమానాశ్రయ పనులు 98.74శాతం పూర్తి
జూలై లేదా ఆగస్టు నెలలో ప్రారంభానికి సన్నాహాలు
మంత్రి జనార్దన్‌రెడ్డి
భోగాపురం, ఏప్రిల్ 5(ఆంధజ్ర్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టు రాకతో ఉత్తరాంధ్ర దశ మారిపోతుందని, అనేక పరిశ్రమలు వస్తాయని రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు. భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపు 98.74శాతం పూర్తయిందని, జూలై లేదా ఆగస్టు నెలలో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. విమానాశ్రయ పనులను ఆదివారం రాత్రి ఆయన జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు రాకతో టూరిజం అభివృద్ధికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇంటర్నేషనల్ పాసింజర్లు రావాలంటే అన్ని సౌకర్యాలు, కనెక్టవిటీ ఉండాలని, దానికి అనుగుణంగానే తాజ్‌హోటల్ నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేత ఎయిర్‌పోర్టును ప్రారంభించేలా ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబునాయుడు ఎయిర్‌పోర్టును పరిశీలించి పనులు వేగవంతం అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తు చేశారు. 98.74శాతంకు పైగా పనులు పూర్తయ్యాయని, ఎర్త్ వర్కు, రన్‌వే, ట్యాక్సీవే పనులు 100శాతం జరిగాయన్నారు. పీటీబీ పనులు 98.76శాతం, ఏటీసీ 95.75శాతం, భవనాలు 93.45శాతం కొలిక్కిరాగా పాసింజర్ టెర్మనల్ పనులు పూర్తి అయ్యాయన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ, హైవే నుంచి ఎయిర్‌పోర్టుకు చేపట్టిన కనెక్టవిటీ రహదారుల పనులు వేగవంతం అయ్యాయన్నారు. ట్రపెంట్ పనులు జూన్ 15నాటికి పూర్తి అవుతాయన్నారు.
ఫ అంతకుముందు ట్రంపెట్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను, ఎయిర్‌పోర్టులో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రతినిధులతో మాట్లాడి పనుల స్థితిని తెలుసుకున్నారు. వారి వెంట ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టిఅప్పలనాయుడు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఆర్డీవో ఎస్.సుధాసాగర్, ఎయిర్‌పోర్టు అథారిటీ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, సీఈవో అన్వర్‌బీర్ సింగ్ తదితరులు ఉన్నారు.