Development of Tribal గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - May 19 , 2026 | 12:16 AM
Development of Tribal Areas is the Goal జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా నిర్వహిస్తున్న జనజాగృతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రత్యేక ప్రచార వాహనాన్నిజెండా ఊపి ప్రారంభించారు.
పార్వతీపురం, మే18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా నిర్వహిస్తున్న జనజాగృతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రత్యేక ప్రచార వాహనాన్నిజెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని 14 మండలాల్లోని 333 గ్రామాల్లో ఈ నెల 19 నుంచి 25 వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. దీని ద్వారా 1.90 లక్ష మంది గిరిజనులకు ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యం, విద్య, పారిశుధ్యం, జీవనోపాధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నట్టు వెల్లడించారు. ప్రతి గ్రామంలో ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రచారంలో భాగస్వాములవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పార్వతీపురం, పాలకొండ ఐటీడీఏ పీవోలు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
సైకిల్‌పై కలెక్టరేట్‌కు ..
పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సోమవారం కలెక్టరేట్‌కు సైకిల్‌పై వచ్చారు. వాహనాన్ని పక్కనపెట్టి.. తన బంగ్లా నుంచి సుమారు కిలోమీటరు మేర.. సైకిల్ తొక్కుకుంటూ నేరుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి సైకిల్ పైనే బంగ్లాకు చేరుకున్నారు.
పక్కాగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సీఎస్‌డీవోలతో సమావేశమయ్యారు. ఈనెల 21 నుంచి జిల్లాలోని 16 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. జిల్లాలో సుమారు 10 వేల మంది విద్యార్థులు టెన్త్ పాసవ్వగా.. వారిలో కనీసం 7,500 మందిని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని డీఐఈవో వై.నాగేశ్వరరావును ఆదేశించారు. డిగ్రీ కళాశాలల్లోనూ ప్రవేశాలు పెరిగేలా అధ్యాపకులు చొరవ చూపాలన్నారు. ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షల నిమిత్తం ప్రత్యేక శిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
-జిల్లాలో మరో ఐదు రోజులు పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వాతావరణ శాఖ అందించిన నివేదిక ప్రకారం జిల్లాలోని పలు మండలాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.