మహిళలతోనే సమాజ అభివృద్ధి
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:33 AM
మహిళల అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమని మానవ హక్కుల సంకల్పవేదిక రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గోనా మానస అన్నారు
బొబ్బిలి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మహిళల అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమని మానవ హక్కుల సంకల్పవేదిక రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గోనా మానస అన్నారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా బొబ్బిలి సీఐ కింతలి నారాయణరావు ఆధ్వర్యంలో ఆదివారం స్ధానిక కోవెల సెంటరు నుంచి మహిళలు, విద్యార్ధులు , పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ ఇంటికి వెలుగు ఇల్లాలు అనేది అక్షరసత్యమన్నారు. ఎదుటి వారిని ప్రశ్నించే ముందు మనల్ని మనం ప్రశ్నించకునే తత్వాన్ని అలవరుచుకోవాలన్నారు. ప్రాథమిక వ్యక్తిత్వాన్ని సడలిపోనివ్వకుండా ప్రాథమిక హక్కుల పరిరక్షణకు నడుంబిగించాలన్నారు. కుటుంబ విలువలు, మానవీయ విలువలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి విద్యార్ధులను ఆ దిశలో విరివిగా ప్రోత్సహించాలన్నారు. విదేశీ సంస్కృతిని గుడ్డిగా పాటించే వారిలో అవగాహన కల్పించాలన్నారు. సీఐ నారాయణరావు మాట్లాడుతూ సమాజాన్ని అభ్యుదయ భావం తీసుకెళ్లే శక్తియుక్తులు మహిళలకు ఉందన్నారు. చట్టాల పట్ల అవగాహన పెంచుకొని బాధ్యతా యుతంగా మెలగాలని హితవు పలికారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూడలి, తాండ్రపాపారాయ సెంటర్, బలిజిపేట రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రమేష్, జ్ఞానప్రసాద్, ఏఎస్‌ఐలు సన్యాసి రావు, హెచ్‌సీలు, మాజీ కౌన్సిలర్ బీసపు పార్వతి, సంకల్ప వేదిక ప్రతి నిధులు, పోలీసులుపాల్గొన్నారు.