Welfare is the Goal అభివృద్ధి మంత్రం.. సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:22 AM
Development Mantra.. Welfare is the Goal అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. సూపర్‌సిక్స్ పథకాలను సూపర్‌హిట్‌గా అమలు చేస్తున్నామని వెల్లడించారు. జీరో పావర్టీ లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు.
కూటమి పాలనలో ప్రగతి పరుగులు
సూపర్ సిక్స్ పథకాలను సూపర్‌హిట్‌గా అమలు
మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి
గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాకేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
పార్వతీపురం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. సూపర్‌సిక్స్ పథకాలను సూపర్‌హిట్‌గా అమలు చేస్తున్నామని వెల్లడించారు. జీరో పావర్టీ లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసుల పరేడ్, జాగిలాల విన్యాసాలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొలుత మంత్రి సంధ్యారాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డితో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వారి ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి. అమరవీరుల స్ఫూర్తితో నేటితరం ముందుకు సాగాలి.
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చొరవతో జిల్లాకు వచ్చిన రెండు కుంకీల ద్వారా జిల్లాలో అటవీ ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. స్ర్తీశక్తి పథకం ద్వారా పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోలకు చెందిన 240 బస్సుల్లో 2.39 కోట్ల మంది మహిళలు ప్రయాణించి రూ.82.50 కోట్లు ఆదా చేసుకున్నారు. దివ్యాంగ శక్తి పథకం కింద 39 వేల దివ్యాంగులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి రూ.14.5 లక్షలు ఆదా చేసుకున్నారు. జిల్లాలో 1.37 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు రూ.58.21 కోట్లు చొప్పున ప్రతినెలా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక పింఛన్లు అందిస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద 1,15,001 మంది విద్యార్థులకు సంబంధించి 81,598 మంది తల్లుల ఖాతాల్లో రూ.172.50 కోట్లు జమచేశాం. అన్నదాత సుఖీభవ పథకం కింద 1.22 లక్షల రైతుల కుటుంబాలకు రూ.240.48 కోట్లు అందించాం. దీపం పథకం కింద ఇప్పటివరకు 1.3 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1.06 కోట్లనుసబ్సిడీ ద్వారా విడుదల చేశామన్నారు. ఆటో, టాక్ర్సీడైవర్లకు రూ.15 వేల చొప్పున 2025-26లో 4963 మందికి రూ.7.44 కోట్లు జమ చేశాం, జిల్లాలో 952 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేలు, ఇమామ్‌లకు రూ.10 వేలు, ఎనిమిది మౌజనులకు నెలకు రూ.5 వేలు చొప్పున గౌరవ వేతనాలు అందిస్తున్నాం.
ఖరీఫ్, రబీ సీజన్‌లో 550921 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి సాధించి రాష్ట్రంలోనే మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఎల్‌నినో నేపథ్యంలో కరువును తట్టుకునే విధంగా పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించాం. ఇప్పటివరకు 1784 మందికి సీసీఆర్‌ఎస్ కార్డులు అందించాం. ప్రస్తుతం ఎనిమిది డ్రోన్లు అందుబాటులో ఉంచాం. ఈ ఏడాది 21 డ్రోన్లతో ఎనిమిది వేల ఎకరాల్లో స్ర్పేయింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాం. పదో తరగతిలో 96.7 శాతం ఉత్తీర్ణతతో నాలుగో సంవత్సరం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది షైనింగ్ సార్ట్స్ అవార్డులను 121 మంది విద్యార్థులకు అందించాం. 58 వేల మందికి మధ్యాహ్న భోజన ం అందిస్తున్నాం. రూ.19.3 కోట్లుతో విద్యార్థి మిత్ర కిట్లును పంపిణీ చేశాం. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ కలిగింది. జిల్లాలోని 1702 పాఠశాలల్లో ప్రతి శనివారం ఆనందలహరి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో ప్రతి శనివారం సుమారు 114200 మంది విద్యార్థులకు మన్యం డ్యాన్స్‌లో శిక్షణ అందిస్తున్నాం. నీతి అయోగ్ ర్యాకింగ్‌లో దేశంలోనే మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మాతా శిశు మరణాల నియంత్రణ, ఎన్టీఆర్ వైద్య సేవలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. సాలూరు, సీతంపేట ఆసుపత్రులను వంద పడకలుగా, భద్రగిరిని 50 పడకల ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశాం. మన్యం వీడియో డాక్టర్ ద్వారా ఈ నెల 8 నుంచి మారుమూల గిరిజనులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాం. జూలై 1 నుంచి 4574 వైద్య శిబిరాలు నిర్వహించి.. 14127 మందికి చికిత్స అందించాం. 21 ఆసుపత్రుల్లో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.
275 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 51,723 మందికి సేవలు అందిస్తున్నాం. 22 మినీ అంగన్‌వాడీలను ప్రధాన కేంద్రంగా మార్చాం. భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశాం. గిరిజన సంక్షేమశాఖ ద్వారా ఆశ్రమ పాఠశాలలు, ప్రీ మెట్రిక్ , పోస్టుమెట్రిక్ గృహాలు, ప్రాథమిక పాఠశాలల్లో 1.61 లక్షల మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నాం, మెగా డీఎస్సీ ద్వారా 850 పోస్టులను భర్తీ చేశాం. రూ. 35 కోట్లతో నిర్మించిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శనశాలను ఈ సంవత్సరం ప్రారంభిస్తాం. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో 13 వేల మంది గిరిజన విద్యార్థులతో థింసా నృత్యం చేపట్టి గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించాం.
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు డిజిటల్‌పై అవగాహన కల్పించి.. నైపుణ్య అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తున్నాం. సవర కళల అభివృద్ధి, గిరిజనులకు వైద్యం, పైనాపిల్ సాగుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పలు సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. కాఫీ, పసుపు, జీడిపప్పు, రబ్బరు, తేనె తదితర గిరిజన ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ సదుపాయం కల్పించి.. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. డోలీ రహిత గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. దీనిలో భాగంగా ఏజెన్సీలో 85 గ్రామాలకు రూ.52.54 కోట్లతో 150 రోడ్లు మంజూరు చేశాం. ఇప్పటికే 62 గ్రామాల్లో రహదారుల పనులు పూర్తయ్యాయి. ’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి తదితరులు పాల్గొన్నారు.