Coordination సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:17 AM
Development is Possible Only Through Coordination అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకులు సకాలంలో చేరుకోవాలన్నారు.
పార్వతీపురం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకులు సకాలంలో చేరుకోవాలన్నారు. వ్యవసాయం, విద్య, స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాల విషయంలో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు. వివిధ జీవనోపాధి పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంకర్లు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని సూచించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్నారు. బ్యాంకు మేనేజర్లు ప్రతి వారం ఒక నిర్దిష్ట సమయాన్ని కేటా యించి నేరుగా వినియోగదారుల సమస్యలను వినాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
కాలువలపై అక్రమ నిర్మాణాలు తొలగించండి..
పట్టణ ప్రాంతాల్లో మురుగు కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. కాలువలపై ఆక్రమణల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని, పారిశుధ్య సమస్యలు తలెత్తడమే కాకుండా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవు తున్నాయని తెలిపారు. ఆక్రమణదారులకు వెంటనే నోటీసులు జారీ చేసి నిర్ణీత గడువులోగా వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ సెక్రటరీలు క్షే త్రస్థాయిలో పర్యటించి ఆక్రమణలు జరగకుండా చూడాలని ఆదేశించారు. మురుగునీరు నిల్వ లేకుండా చేస్తే దోమలను అరికట్టొచ్చన్నారు. తద్వారా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చని తెలిపారు. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉండాలని, బహిరంగ మల విసర్జనను పూర్తిగా నియంత్రించాలని ఆదేశించారు.
మలేయా నివారణకు హోమియోపతి
మలేరియా నివారణలో భాగంగా జిల్లాలో హోమియోపతి మందులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మందులు మూడు రోజుల పాటు మూడు డోసులు చొప్పున తీసుకో వాలని సూచించారు. గర్భిణులు మినహా అందరూ ఈ మందులు వేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం అధికారులు సుశీల, హేమాక్షి, వర్మ, ఆదిలక్ష్మి, పావని తదితరులున్నారు.
నా కుమారుడి మృతిపై దర్యాప్తు చేయండి
‘ నా కుమారుడి మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.. దర్యాప్తు నిర్వహించి న్యాయం చేయండి..’ అని ఓ తల్లి పీజీఆర్‌ఎస్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. బలిజిపేట మండలానికి చెందిన చింతాడ ఆదిలక్ష్మి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి.. తన కుమారుడి ఫొటో చేతపట్టుకుని కన్నీరుమున్నీరైంది. తన కుమారుడిని ఎవరో హత్య చేశారని ఆరోపించింది. వెంటనే దర్యాప్తు చేయాలని కోరింది. తన బిడ్డను దూరం చేసి వారిని శిక్షించాలని వేడుకుంది.