Devastation Caused by Gale Storms గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 23 , 2026 | 12:35 AM
Devastation Caused by Gale Storms జిల్లావ్యాప్తంగా పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగుల శబ్దాలకు జనం బెంబేలెత్తిపోయారు. గాలులకు ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఫ్లెక్సీలు, బోర్డులు విద్యుత్ వైర్లపై పడడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జీడి, మామిడి, ఇతర రబీ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
వాహన రాకపోకలకు ఇబ్బందులు
నిలిచిన కరెంట్ సరఫరా
నేలరాలిన మామిడి
చల్లబడిన వాతావరణం
ఎండ వేడి నుంచి ఊరట చెందిన జిల్లావాసులు
పార్వతీపురం/పాలకొండ/పార్వతీపురం టౌన్/సీతంపేట రూరల్/ గరుగుబిల్లి, మే22 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగుల శబ్దాలకు జనం బెంబేలెత్తిపోయారు. గాలులకు ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఫ్లెక్సీలు, బోర్డులు విద్యుత్ వైర్లపై పడడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జీడి, మామిడి, ఇతర రబీ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాస్తవంగా శుక్రవారం మధ్యాహ్నం వరకూ భానుడు తన ప్రతాపం చూపాడు. అధిక ఎండ , ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రానికి వాతావరణం పూర్తిగా మారింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులు.. ఈదురుగాలలతో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల మాత్రం ఓ మోస్తరుగా వాన పడింది. అయితే గాలుల తీవ్రతకు చెట్లు కూలడంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. సీతంపేట మండలం గడిగుడ్డి గ్రామ సమీపంలోని పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారిపై చెట్టు నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సీతంపేట ఎస్సై అమ్మన్నరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ట్రాక్టర్ సహాయంతో రహదారికి అడ్డంగా కూలిన చెట్టును తొలగించారు. ఎన్‌టీఆర్ అడ్వంచర్ పార్క్, ఐటీడీఏ కాంప్లెక్స్, దోనుబాయికి వెళ్లే మార్గంలో కూడా చెట్లు నేలకూలాయి. ట్రాన్స్‌కో ఏఈ నీలిమ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది కూలిన చెట్లను తొలగించి లైన్‌లను సరిచేసి విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. గాలివాన కారణంగా ఇక వీరఘట్టం, పాలకొండ, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, భామిని, కొమరాడ, పార్వతీపురం తదితర మండలాలతో పాటు, పార్వతీపురం పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భామిని మండలంలో బత్తిలి నుంచి ఘనసర వరకు వర్షం కురవగా.. వేసవి దుక్కులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు. ఏదేమైనా కొద్ది రోజులుగా ఎండతీవ్రతతో అల్లాడుతున్న మన్యం ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది.
ట్రాక్టర్ బోల్తా: మహిళలు మృతి
గుమ్మలక్ష్మీపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): అడ్డంగూడ జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ గాలులకు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు అడ్డంగూడ చెం దిన లక్ష్మి, భవానీ, లక్కాయి మరో ఇద్దరు కలిసి ఒడిశాలోని గొట్లభద్ర ఇటుకుల ట్రాక్టర్ లోడ్‌తో వెళ్లారు. అయితే తిరిగి వస్తుండగా వాహనం తొట్టె బోల్తాపడింది. దీంతో లక్ష్మి (36) ఘటనా స్థలంలో మృతి చెందింది. గాయాలపాలైన వారిని భద్రగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరొక మహిళ భవానీ (35)ని జిల్లాకేంద్రాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఎల్విన్‌పేట ఎస్‌ఐ శివప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతురాలు లక్ష్మికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా అదే వాహనంలో ఉన్న ఆమె భర్త లక్కాయికి గాయాల వడంతో ప్రస్తుతం ఆయన భద్రగిరి ఆసుత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక పోతే భవానీ మృతితో ఇద్దరు పిల్లలు , భర్త కన్నీరుమున్నీరవుతున్నారు.