Gale Storms గాలివాన బీభత్సం
ABN , Publish Date - May 01 , 2026 | 11:41 PM
Devastation Caused by Gale Storms జిల్లాలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసింది. ఆ తర్వాత వాతావరణం వేడెక్కింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఆ సమయంలో ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్నం వరకు ఎండ వేడి అధికంగా ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నిలిచిన కరెంట్ సరఫరా
అంధకారంలో గ్రామాలు
మామిడి, జీడి, మొక్కజొన్నకు తీవ్ర నష్టం
జిల్లాలో విభిన్న వాతావరణం
మధ్యాహ్నం వరకు ఎండ.. ఆ తర్వాత వర్షం
చల్లబడిన వాతావరణం..
ఎండ వేడి నుంచి ప్రజల ఉపశమనం
పార్వతీపురం/పాలకొండ, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసింది. ఆ తర్వాత వాతావరణం వేడెక్కింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఆ సమయంలో ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్నం వరకు ఎండ వేడి అధికంగా ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలుల కారణంగా ప్రధాన రహదారులు, కూడళ్లలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచింది. మామిడి పంటకు నష్టం తీవ్ర నష్టం వాటిల్లింది. ఏదేమైనా అకాల వర్షంతో వాతావరణం చల్లబడగా.. ఎండ వేడి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం చెందారు. ఏదేమైనా గడిచిన మూడు రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో జిల్లావాసులు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఉపరితల ద్రోణి ప్రభావంతోనే మన్యంలో ఈ పరిస్థితులు ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
పలుచోట్ల ఇలా..
-పాలకొండ మండలంలో శుక్రవారం వీచిన ఈదురుగాలులకు 25 వరకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, రేకుల షెడ్‌లు ఎగిరిపడ్డాయి. దీంతో పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా అంధకారం నెలకొంది. కొన్ని గ్రామాలకు శనివారం సాయంత్రం నాటికి కూడా విద్యుత్ పునరుద్ధరణ జరిగే పరిసితి కనిపించడం లేదు.
- జిల్లా వ్యాప్తంగా మామిడి, జీడిమామిడితో పాటు రబీ కింద వేసిన వరి, మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు తదితర ప్రాంతాల్లో అరటి చెట్లు నేలవాలాయి.
- భామిని: మండలంలోని కల్లాల్లో నీరు చేరడంతో వర్షపు నీరు మళ్లించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ ఈదురుగాలులు వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీనిపై ఏఈ రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా.. మరమ్మతులు చేస్తున్నామన్నారు.
- పార్వతీపురం రూరల్: పులిగుమ్మి తదితర ప్రాంతాలో మామిడి పంటకు తీవ్ర నష్టం ఏర్పడింది.
- సీతంపేట రూరల్: సీతంపేట మన్యంలో శుక్రవారం ఉదయం, సాయంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. గాలులకు అక్కడక్కడా చెట్లు నేలకొరిగాయి. జీడి, మామిడి పంటలకు కొంతవరకు నష్టం వాటిల్లిందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
- గరుగుబిల్లి: గాలులకు గిజబ ప్రధాన రహదారిపై భారీ చెట్లు నేలకొరగడంతో సుమారు రెండు గంటలకు పైగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పార్వతీపురం నుంచి కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, ఒడిశా వైపు వెళ్లే వాహనాలు బారులుదీరాయి. స్థానికులు చెట్లను తొలగించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. సంతోషపురం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రైస్ మిల్లు ఎలివేటర్లు నేలమట్టమయ్యాయి. మామిడి పంట నేల రాలింది.
- కొమరాడ: గాంధీనగరం, రామభద్రపురం గ్రామాల మధ్య అంతర్రాష్ట్ర రహదారిపై భారీ చెట్లు కూలింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విద్యుత్ తీగలపై చెట్టు పడడంతో కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఆర్‌అండ్‌బీ, పోలీస్ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సమీప గ్రామ ప్రజల సహకారంతో చెట్టును తొలగించారు. దీంతో వాహన రాకపోకలు యథావిధిగా సాగాయి.
- మక్కువరూరల్: మక్కువలో సుమారు అరగంటపాటు వర్షం కురవండంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో చెట్లు నేలకూలాయి.
- వీరఘట్టం: వీరఘట్టంతో పాటు నడుకూరు, విక్రంపురంలో వరి పంట నేలకొరిగింది. మొక్కజొన్న పిక్కలు తడిసి ముద్దయ్యాయి.