Share News

కుంకీలు ఉన్నా.. ఆగని ఘీం‘కరి’ంపు

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:24 AM

Despite Kumkis, the Elephant Menace Continues జిల్లాకు కుంకీలు వచ్చినా.. మన్యం వాసులకు అటవీ ఏనుగుల బెడద తప్పడం లేదు. గజరాజుల బీభత్సం వల్ల తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. చేతికందొచ్చిన పంటలను కోల్పోతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాలను చవిచూస్తున్నారు. గ్రామస్థులు, రైతులు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సి వస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.

కుంకీలు ఉన్నా.. ఆగని ఘీం‘కరి’ంపు
పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు

  • అయినా ప్రజలకు తప్పని గజరాజుల బెడద

  • తరలింపు చర్యలపై విమర్శలు

  • ఒడిశా నుంచి తిరిగొస్తున్న ఏనుగులు

  • సమస్యకు శాశ్వత పరిష్కారం చూపని వైనం

  • పట్టించుకోని ఉన్నతాధికారులు

పార్వతీపురం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు కుంకీలు వచ్చినా.. మన్యం వాసులకు అటవీ ఏనుగుల బెడద తప్పడం లేదు. గజరాజుల బీభత్సం వల్ల తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. చేతికందొచ్చిన పంటలను కోల్పోతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాలను చవిచూస్తున్నారు. గ్రామస్థులు, రైతులు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సి వస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఒంటరిగా పొలాలకు కూడా వెళ్లలేకపోతున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో తిరగలేకపోతున్నారు. ఏనుగుల అలజడితో కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్న మన్యం వాసులకు కుంకీల రాకతో కొంత ఊరట కలిగింది. తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావించారు. గజరాజుల బెడద తప్పుతుందని ఆశించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. జిల్లాకు కుంకీ ఏనుగులు వచ్చి నాలుగు నెలలవుతున్నా.. పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో జిల్లావాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం డివిజన్‌లో ఎనిమిది, పాలకొండ డివిజన్‌లో నాలుగు చొప్పున గజరాజులు సంచరిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఆస్తి, పంట, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. జనావాసాల్లో హల్‌చల్‌ చేస్తూ.. రైతులు, గ్రామస్థులను బెంబేలెత్తిస్తున్నాయి. అయితే ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జూలై నెలలో చిత్తూరు జిల్లా నుంచి జయంత్‌, అభిమన్యు అనే రెండు కుంకీలను మన్యానికి పంపించింది. వాటి ద్వారా అటవీ ఏనుగులను కట్టడి చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు కుంకీలకు సీతానగరం మండలం గుచ్చిమిలోని ఎలిఫెంట్‌ జోన్‌కు తరలించారు. ఆ తర్వాత పలుమార్లు కుంకీలతో ఆపరేషన్‌ చేపట్టారు. వాటి సాయంతో అటవీ ఏనుగులను తరలించే ప్రయత్నం చేసినా.. ప్రయోజనం లేకపోయింది. ఒడిశా వైపు వెళ్తున్న గజరాజులు తిరిగి జిల్లాకు చేరుతున్నాయి. దీంతో మన్యం వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు.

- కుంకీల సాయంతో అటవీ ఏనుగులను సురక్షిత కేంద్రాలకు తరలించే విషయంపై రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే వాదనలు లేకపోలేదు. కేవలం కుంకీ ఏనుగులను జిల్లాకు పంపించి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- అటవీ ఏనుగులు తరలించాలంటే ముందుగా ఆ శాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించుకోవాలి. ఒడిశా అధికారులతో సమావేశం నిర్వహించి.. అటవీ ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకోవాలని మన్యం వాసులు కోరుతున్నారు. ఒడిశా వైపు వెళ్తున్న గజరాజులు తిరిగి జిల్లాకు రాకుండా చూడాలని వేడుకుంటున్నారు.

ప్రయత్నిస్తున్నాం

‘ కుంకీల ద్వారా అటవీ ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మా శాఖ ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. అయితే ఒడిశా రాష్ట్రం వైపు ఏనుగులు వెళ్తే.. వాటిని తిరిగి ఏపీ వైపు పంపించేస్తున్నారు. అటవీ ఏనుగుల వల్ల ప్రజలకు ఏ ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.’ అని పార్వతీపురం రేంజర్‌ మణికంఠేష్‌ తెలిపారు.

Updated Date - Nov 28 , 2026 | 12:24 AM